కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి తల్లి .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె పవన్ ను నేరుగా టార్గెట్ చేశారు. గతంలో పవన్ .. తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు రీఓపెన్ పై పెడతానని చెప్పారని కానీ పధ్నాలుగు నెలలు అయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జనసేన పార్టీ ఆఫీసు ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.
కర్నూలులో ఓ స్కూల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 2017లో ఇది జరిగింది. ఆత్మహత్య అని స్కూల్ యమాజన్యం, అత్యాచారం చేసి హత్య చేశారని ప్రతీతల్లిదండ్రులు వాదిస్తున్నారు. పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యకు ప్రేరేపించారని అభియోగాలు పెట్టి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు. ఈ కేసు రాజకీయం అయింది. పవన్ కల్యాణ్.. ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని వారు కోరుకున్నట్లుగా సీబీఐ విచారణ చేయిస్తామన్నారు.
అయితే సీబీఐ తమ వద్ద వనరులు లేవని..కేసును విచారించలేమని కోర్టుకు తెలిపింది. టీడీపీ ప్రభుత్వం రెండో సారి ఏర్పడిన తర్వాత సీఐడీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. సీఐడీ లేదా సీబీఐతో.. సమగ్ర విచారణ జరిపి నిజమేంటో ఆ తల్లికి కన్విన్సింగ్ చెబితే.. సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అలాంటి ప్రయత్నాలను ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ఫలితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.