యూట్యూబ్ నుంచి వచ్చిన నటుడు సుహాస్. చాయ్ బిస్కెట్ ఛానల్లో చిన్న చిన్న వీడియోలు, రీల్స్ చేస్తూ మెల్లమెల్లగా సినిమా అవకాశాలు అందుకున్నాడు. కలర్ ఫోటోతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. సుహాస్‌లో ఒక విలక్షణమైన నటుడు ఉన్నాడు. తను డైలాగ్ చెప్పిన విధానం, స్క్రీన్‌పై కనిపించే తీరు ప్రత్యేకంగా ఉంటాయి. తనకంటూ ఒక డిక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. బిగినింగ్‌లో తను చేసిన కొన్ని పాత్రలు బాగుండేవి. అయితే రానురాను తన నుంచే వచ్చే కంటెంట్ లో బలం తగ్గిపోతూ వస్తుంది. గత నాలుగు సినిమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపకుండా పోయాయి.
రీసెంట్గా వచ్చిన “ఓ భామా అయ్యో రామా” అయితే మరీ దారుణంగా ఉంది. అసలు భరించలేని సినిమానే రివ్యూలు వచ్చాయి. అసలు ఇంత వీక్ కంటెంట్ ఉన్న సినిమాని సుహాస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మూడేళ్లుగా పరిశీలిస్తే తన నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ “మంచి సినిమా” అనే మాట రావడం లేదు. వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన ఫలితం దక్కట్లేదు. ఒక సినిమాని థియేటర్స్ కోసం తీయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. సుహాస్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ థియేటర్స్‌లో జనం కనిపించడం లేదు.
సినిమాల సంఖ్య పెంచుతూ ఉన్నా జనం లేకపోతే ప్రయోజనం ఉండదు. నామ్ కే వాస్తూ సినిమాను థియేటర్ లో వుంచి తర్వాత ఓటిటికి ఇచ్చేసే వ్యవహారమే సుహాస్ సినిమాల్లో కనిపిస్తోంది. ఇది అతని కెరీర్‌కి అంత మంచి పరిణామం కాదు. చిన్న హీరో కానీ పెద్ద హీరోగాని ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే సినిమాల పైనే ఫోకస్ చేయాలి. సుహాస్‌లో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు.
చిన్న హీరోలు అవకాశం ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసుకోవాలనే ఆలోచన మంచిదే. కానీ అదే పనిగా జనాలకు ఏమాత్రం ఆసక్తి కలిగించకుండా సినిమాలు చేస్తూ వెళ్తే మాత్రం లీడ్ రోల్లో సినిమాలు తగ్గిపోవడానికి ఎంతో కాలం పట్టదు.