ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఓ పక్క ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఉద్యమిస్తుంటే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తెలుగుదేశం ఓ రకంగా ఇరకాటంలో పడుతున్నట్టే! అయితే, ప్రత్యేక హోదాపై మొదట్నుంచీ కేంద్రంతో బాగా పోరాడి, అలసిపోయిన నేతల్లో సుజనా చౌదరి ఒకరు! కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తరువాత హోదా గురించి ప్రజల్లో లేనిపోని ఆశల్ని పెంచి పోషించింది ఆయనే. కేంద్రంతో మాట్లాడేశాననీ, అరుణ్‌జైట్లో చర్చించాననీ, రెండు మూడు రోజుల్లో సానుకూల ప్రకటన ఉంటుందనీ… ఇలాంటివి చాలానే చెప్పారు! కానీ, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని కట్టేసి, హోదాను సమూలంగా పక్కన పడేస్తున్న తరుణంలో ఈయనా పక్కనే ఉన్నారు. ప్యాకేజీ రూపకల్పనలో సుజనా చౌదరి కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటారు! అయితే, తాజాగా హోదా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వింటుంటే మరీ విడ్డూరంగా ఉన్నాయి.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిసైడ్ చేశారు. విశాఖ రైల్వే జోను అంశంపై కూడా కేంద్రాన్ని ప్రశ్నించాలని అనుకున్నారు. ఈ సమావేశం అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు జరుగుతున్నది అనవసర రాద్ధాంతం అన్నారు. కొందరు కావాలనే ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు అన్నారు. ప్రత్యేక హోదా అనేది చెల్లని రూ. 500, రూ. 1000 నోటుతో సమానమని అన్నారు! మరో రెండు నెలల తరువాత పాత నోట్లు పనికిరావనీ, అలాగే ప్రత్యేక హోదా కూడా అనీ, ప్రస్తుతం రాష్ట్రానికి ఏది అవసరమో అదే మాట్లాడాలని ఆయన అన్నారు.
మొన్నటికి మొన్న… ప్రత్యే క హోదా ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఛాప్టర్ క్లోజ్ చేశారు. ఇప్పుడు చెల్లని నోటుతో సుజనా పోల్చారు! చెల్లని నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి… కాస్త ఓపిగ్గా క్యూల్లో నిలబడితే మార్చుకునే సదుపాయం ఉంది! అంటే, ఆ నోట్లకు కూడా విలువ ఉంది. పోనీ, ఈ లాజిక్ ప్రకారం చెల్లని ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరో రూపంలో మార్చే ప్రయత్నమైనా వీరు చేస్తున్నారా అంటే.. అదీ లేదు! కేంద్రం ఇచ్చిందే చాలు అనేసి చేతులు కట్టుకుని చూస్తున్నారు. కేంద్రం వైఖరిని వెంకయ్య నాయుడు సమర్థించారంటే అర్థముంది, ఎందుకంటే ఆయన భాజపా నాయకుడు కాబట్టి! రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేంద్రాన్ని వెనకేసుకుని రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముంది..?