ఒకప్పటికి సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు వేల కోట్లు కుంభకోణానికి పాల్పడిన సంగతి స్వయంగా బయటపెట్టినప్పుడు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తరువాత ఆయనతో సహా ఆ సంస్థకి చెందిన కొందరు జైలుకి వెళ్లి బెయిల్ పై విడుదలై బయటకి వచ్చారు. అటువంటి సత్యం గ్రూప్ సంస్థలు కూడా కేంద్రమంత్రి సుజనా చౌదరి చేతిలో మోసపోవడం విశేషం. సత్యం గ్రూప్ కి చెందిన ఫైన్ సిటీ, హైగ్రేస్, ఎలెం అనే మూడు ఆర్ధిక సంస్థల నుంచి సుజనా చౌదరికి చెందిన సంస్థలు 2003సం.లో రూ.6కోట్లు అప్పు తీసుకొన్నాయి కానీ వాటిని ఇంతవరకు తీర్చనే లేదు. సుజనా చౌదరి, ఆయన సంస్థలో పనిచేసే మరొక డైరెక్టర్ ఇద్దరూ ఆ అప్పుకి ష్యూరిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్యం సంస్థలు సుజనా గ్రూప్ కి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాకపోవడంతో అవి కోర్టుకి వెళ్ళాయి. ఆ కేసుని హైదరాబాద్ సివిల్ కోర్టు విచారణ జరిపింది. అయితే ఆ లావాదేవీలతో తనకేమీ సంబంధం లేదని సుజనా చౌదరి తరపు న్యాయవాది వాదించారు. కానీ న్యాయస్థానం ఆయన వాదనలతో ఏకీభవించలేదు. వడ్డీతో సహా వడ్డీతో కలిపి మొత్తం రూ.17కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
ఇదివరకు మారిషస్ బ్యాంక్ కూడా సుజనా చౌదరి సంస్థలపై ఇటువంటి కేసే పెట్టింది. ఆయనకి చెందిన సంస్థలు తమకి రూ.108 కోట్లు బాకీ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపిస్తూ కోర్టుని ఆశ్రయించినప్పుడు అప్పుడు కూడా ఆయన ఈవిధంగానే వాదించారు. ఆ కేసు విచారణకి హాజరు కానందున న్యాయస్థానం ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ కేసు బయటపడింది.
తను కేంద్రమంత్రిగా ఉన్నందునే ఆ సంస్థలు ఈవిధంగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆయన వాదిస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కదా? ఈ కేసులలో న్యాయస్థానాలు ఆయనని వేలెత్తి చూపుతున్నప్పుడు తాను నిర్దోషినని అయన ఎంత గట్టిగా వాదించినా ప్రజలు నమ్మబోరని గ్రహిస్తే మంచిది.
ఇటువంటి కేసులలో ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకొని ఉపశమనం పొందవచ్చు కానీ కేంద్రమంత్రిగా ఉన్న ఆయనపై తరచూ ఇటువంటి ఆరోపణలు, కేసులు వస్తుండటం వలన వ్యక్తిగతంగా ఆయనకి, తెదేపాకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా అప్రదిష్ట కలుగుతుంది. ఈ కేసుల వలన ప్రస్తుతం ఆయనకి, ఆ రెండు పార్టీలకి, ప్రభుత్వాలకి పెద్దగా ఇబ్బందేమీ లేకపోవచ్చు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఇటువంటి లెక్కలన్నిటినీ తప్పకుండా బయటకి తీయకుండా ఊరుకోవు. అప్పుడు అందరూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.