రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఇప్పటివరకూ చాలా కష్టపడ్డాం.. ఇకపై మరింతగా కృషిచేస్తాం అని చెబుతున్నారు ఏపీ టీడీపీ ఎంపీలు. ఏపీకి రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటికోసం తీవ్రంగా కృషి చేస్తామని ఏపీనుంచి ఎన్నికైన కేంద్రమంత్రి చెప్పడం ఏమిటి అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నారు సుజనా!! వినడానికి హాస్యాస్పదంగా ఉందని అన్నా, వారి చిత్తశుద్ధిని తెలిపేదిగా ఉందని చెప్పినా, అలాంటిదేమీ లేదు రాష్ట్రం కోసం తెగ కష్టపడుతున్నారని భ్రమించినా… ఆ పోరాటంలో “ప్రత్యేక హోదా” మాత్రం లేదన్నది మరోసారి స్పష్టం చేశారు సుజనా చౌదరి! ఎందుకంటే టీడీపీ ఎంపీలు చెప్పే రాజ్యాంగ బద్ధగా రావాల్సిన వాటిలో వారి దృష్టిలో ఆ హోదా లేదు.. కాదు కాదు.. ఉండదు!
తాజాగా చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో భేటీ అయ్యారు తెదేపా ఎంపీలు, కేంద్ర మంత్రులు. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన సుజనా చౌదరి… “నియోజక వర్గాల పెంపు, పోలవరం నిధుల పెంపు” విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో పట్టుబడతామని సెలవిచ్చారు! ఈ సమయంలో నియోజకవర్గాల పెంపు ప్రధాన విషయమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఆ పోరాడేవాటిలో హోదా మాత్రం లేదు అనేది గమనించాల్సిన విషయం! ఈ సందర్భంగా “ప్రత్యేక హోదా” అనేది ముగిసిన ముచ్చట అని మరోసారి చెప్పుకొచ్చారు సుజనా. అయితే అది టీడీపీ, బీజేపీ ఎంపీలకు ముగిసిన ముచ్చట కావొచ్చేమో కానీ ఏపీ ప్రజలకు కాదని మరిచిన సుజనా… “రాజ్యాంగ బద్ధంగా” రాష్ట్రానికి ఏమి రావాలో అవన్నీ తేవడానికి కృషి చేస్తామని చెప్పడం కొసమెరుపు.
ఇదే సందర్భంలో మరో విషయం చెప్పారు సుజనా చౌదరి. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా గురించి ఎలా గోల చేసినా, గోడు వెల్లబుచ్చుకున్నా తనకేమీ పట్టదు అన్నట్లుగా… మరోసారి “ప్రత్యేక ప్యాకేజీ” విషయం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు బీజేపీ-టీడీపీ నేతలు ఇచ్చిన తమదైన వరంగా చెప్పుకుంటున్న “ప్రత్యేక ప్యాకేజీ” కి ఫిబ్రవరి 15లోగా చట్టబద్ధత సాధించి తీరుతామని తెలిపారు. ఇంకో సంగతేమిటంటే… ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంపై కేంద్రం ఇప్పటికే జాప్యం చేసిందట! అవును జాప్యం చేసింది… ఇదేనా కేంద్ర ప్రభుత్వానికి ఏపీపై ఉన్న చిత్తశుద్ధి అని ఎవరూ అనొద్దు సుమా!!