రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజి సినిమా మీద విపరీతమైన హైప్ కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఏ టాలీవుడ్ సినిమాకు లేనంత హైప్ తో వస్తున్న ఈ సినిమా, ఆ అంచనాల కి తగ్గట్టు ఉంటుందా? సాహో ఫలితంతో నిమిత్తం లేకుండా తన మీద ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని సుజిత్ నిలబెట్టుకుంటాడా? సాహోలో చేసిన పొరపాట్లని సవరించుకొని గంభీరమైన బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేక అభిమానుల ఆశలను జపాన్ తూర్పు సముద్రంలో ముంచేస్తాడా అన్నది కొన్ని గంటల లో తెలిసిపోతుంది. అయితే ఈ సందర్భంగా సాహో లో సుజిత్ చూపించిన స్క్రీన్ ప్లే బ్రిలియన్స్, దర్శకత్వ మెరుపులు, వీటన్నిటిని కమ్మేసి మరీ సినిమా ఫలితాన్ని నిర్దేశించిన పొరపాట్లు చర్చకు వస్తున్నాయి. “They Call him OG” విడుదల సందర్భంగా ఒకసారి సాహో ని పునర్ వీక్షిస్తే ..
సాహో కథ క్లుప్తంగా:
రాయ్ అనే ఒక పెద్ద మాఫియా డాన్ ని చంపేసి, అతని డబ్బు లక్షల కోట్లను కొట్టేసి, రాయ్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న విలన్ ని, హీరో ఎలా అడ్డుకుంటాడు, ఎలా మట్టు పెడతాడు అనేది ఒక లైన్ కథ. అయితే హీరో నేరుగా విలన్ తో తలపడకుండా ఒక పెద్ద మైండ్ గేమ్ & action నడుపుతాడు దర్శకుడు. విలన్ – రాయ్ స్థానాన్ని చేజిక్కించుకోకుండా తాత్కాలికంగా ఆపడం కోసం తన మిత్రుని రాయ్ కుమారుడిలా పంపిస్తాడు హీరో. ఆ తర్వాత విలన్ కొట్టేసిన లక్షల కోట్లను హై సెక్యూరిటీ మధ్య నుండి దొంగిలించడం కోసం బ్లాక్ బాక్స్ రూపంలో ఒక సుదీర్ఘమైన ప్రణాళిక వేస్తాడు. బ్లాక్ బాక్స్ ద్వారా వేల కోట్లు వస్తాయని ప్రభాస్ చెప్పిన అబద్ధాన్ని నమ్మి ట్రాప్ అయిన విలన్ & గ్యాంగ్ ని బురిడీ కొట్టించి ఆ డబ్బు కొట్టేస్తాడు హీరో. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ లో విలన్ ని మట్టుపెడతాడు.
సాహో లో సుజిత్ చూపించిన బ్రిలియన్స్:
Red Herring :నీల్ ఇంట్రడక్షన్ సీన్:
బాలీవుడ్ నటుడు నీల్ ఈ సినిమాలో అండర్ కవర్ పోలీస్ గా నటించాడు. కానీ మొదట్లో ప్రభాస్ & మురళి శర్మ, ఇతన్ని దొంగ అని మిగతా పోలీసులతో చెబుతారు. వాళ్లు కూడా అది నిజమే అని నమ్ముతారు. కానీ దర్శకుడు ఈ ఇంట్రడక్షన్ షాట్ లో నీల్ ని మొదట్లో తలకిందులుగా చూపించి నెమ్మదిగా ఫ్రేమ్ ని నిటారుగా చేస్తాడు. ఈ పాత్ర గురించి ఈ సీన్ లో పోలీస్ పాత్రలో ఉన్న ప్రభాస్ నీల్ ని దొంగ అని చెబుతున్నది అబద్ధం అని, నిజానికి రివర్స్ లో – ప్రభాస్ దొంగ, నీల్ పోలీస్ అని దర్శకుడు ఈ రివర్స్ ఫ్రేమ్ షాట్ లో హింట్ ఇచ్చాడు.
Metaphorical Visual Foreshadowing : పోలీస్ స్టేషన్ లోకి ప్రభాస్ ఎంట్రీ సీన్:
ప్రభాస్ దొంగ అయినప్పటికీ పోలీసు లాగా స్టేషన్ లోకి ఎంటర్ అయి తాను పోలీస్ నే అని అక్కడ అందరిని నమ్మిస్తాడు. ఈ సీన్ లో ప్రభాస్ పోలీస్ స్టేషన్ లోకి మెయిన్ డోర్ లో నుంచి కాకుండా కిటికీలోంచి ఎంట్రీ ఇస్తాడు. అది కామెడీ కోసం చేసిన ప్రయత్నం అని ప్రేక్షకులు భ్రమపడతారు కానీ, ప్రభాస్ దొడ్డి దారిన ఎంటర్ అవుతున్నాడని సీన్ లో హింట్ అలా ఇచ్చాడన్నమాట దర్శకుడు .
Role Reverse: పబ్ లో నీల్ మరియు ప్రభాస్ ల సంభాషణ
పబ్ లో సాంగ్ తర్వాత దొంగ మిస్ అయిపోయాడని ఫీల్ అవుతున్న పోలీస్ ఆఫీసర్ తో తాను దొంగతో మాట్లాడానని ప్రభాస్ చెబుతాడు. అయితే అక్కడ పోలీస్ నీల్ తో దొంగ అయిన తనకి జరిగిన సంభాషణ ని రోల్ రివర్స్ చేసి చెబుతాడు ప్రభాస్. చాలామంది ప్రేక్షకులు ఈ సీన్ ని అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతారు.
Symbolism తో నిండిపోయిన ప్రభాస్ ఇంట్రడక్షన్ ఫైట్:
ప్రభాస్ ఇంట్రడక్షన్ ఫైట్ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. మధ్యలో కొండచిలువ, చిరుత లాంటి రకరకాల జంతువులు తారసపడుతుంటాయి. చాలామంది ఈ ఫైట్ అర్థంపర్థం లేనిది గాను, జంతువులన్నీ కేవలం గ్రాఫిక్స్ ఖర్చుని పెంచడానికి చేసినవి గాను కొట్టి పడేశారు. కానీ, తన తండ్రిని చంపడానికి సమకూర్చిన ఆయుధాలు ఎక్కడ నుండి వచ్చాయో కనుక్కోవడానికి ప్రభాస్ అక్కడికి వచ్చాడని, అక్కడి గుండాలు, ఆయుధాల స్మగ్లింగ్ తో పాటు జంతువుల స్మగ్లింగ్ వంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నారని దర్శకుడు చూపించాడని చాలామంది ప్రేక్షకులకు అర్థం కాలేదు. కానీ కొన్ని హాలీవుడ్ సినిమాల తరహాలో తక్కువ చెప్పి , ఎక్కువ భాగం ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి వదిలేసే టెక్నిక్ దర్శకుడు వాడినట్లు తెలుస్తోంది .
Narrative decoy :బ్లాక్ బాక్స్ Hoax:>/span>
సినిమా మొదటి సగభాగం మొత్తం బ్లాక్ బాక్స్ కొట్టేయడానికి వివిధ పాత్రలు చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయి ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ ని Key లా ఉపయోగించి చనిపోయిన రాయ్ కి సంబంధించిన వేల కోట్ల డబ్బులు ఉన్న లాకర్ ఓపెన్ చేయవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అసలు బ్లాక్ బాక్స్ అనేది మొత్తం బూటకం అని, విలన్ గ్యాంగ్ ని ట్రాప్ చేసి, వాళ్లే తనను తమ స్థావరానికి తీసుకెళ్లేలా చేయడం కోసం ప్రభాస్ వేసిన స్కెచ్ అని, సినిమా లోని మిగతా పాత్రలకే కాదు, చాలామంది ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు.
పైన చెప్పిన సీన్లు కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఇలాంటి స్క్రీన్ ప్లే బ్రిలియన్స్, దర్శకత్వ ప్రతిభ సినిమాలో చాలా సీన్లలో కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి:
Goal Establishment:
ఈ సినిమా లో హీరోకి కొన్ని స్పష్టమైన గోల్స్ ఉంటాయి. కానీ అవేంటో ప్రేక్షకులకు లో చాలా సేపటి వరకు కూడా క్లారిటీ రాదు. హీరో లక్ష్యం ఏంటి అన్నది స్పష్టంగా అర్థమైతే, అప్పుడు హీరో వేసే ఎత్తుకు పై ఎత్తులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అసలు హీరో ఎందుకోసం చేస్తున్నాడు అన్న క్లారిటీ లేకపోతే హీరో వేసే మైండ్ గేమ్స్ అసంబద్ధమైనవిగా కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే. స్క్రీన్ ప్లే పుస్తకం వ్రాసిన సిడ్ ఫీల్డ్ పరిభాష లో చెప్పాలంటే – “If we don’t know what the hero wants, we don’t know what the movie is about.”
Twist Fatigue – ఓవర్ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే:
ఎంతో గొప్ప గొప్ప మైండ్ బెండింగ్ సినిమాల్లో కూడా స్క్రీన్ ప్లే చాలా బాగా వరకు సరళంగా సూటిగా ఉంటుంది. అసలైన Twist వచ్చే సీన్లో మాత్రమే ప్రేక్షకుల బుర్రకు పదును పెడుతుంటారు దర్శకులు, రచయితలు. అలా కాకుండా ప్రతి ప్లాట్ పాయింట్ లో ప్రతి 15 నిమిషాలకి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది అన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా.
Emotional Connect లేకపోవడం:
సినిమాలో ప్రధాన పాత్రలైన హీరో, హీరో తండ్రి మధ్య కానీ, Lead pair మధ్య కానీ, హీరో కి ఇతర పాత్రల కు మధ్య కానీ ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కనిపించదు. ఎంత యాక్షన్ సినిమా అయినా కూడా పాత్రల మధ్య ఎంతో కొంత ఎమోషనల్ కనెక్ట్ అన్నది అవసరం. హాలీవుడ్ లో వచ్చే post apocalyptic సినిమాల్లో సైతం ఏదో ఒకచోట ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడే సన్నివేశాలు వ్రాసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించకపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణం.
స్క్రీన్ ప్లే లో technical brilliance ఎంత ఉన్నా కూడా, కథలో, కథనంలో coherence లేకపోతే సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది సుజిత్ కి సాహో తో బాగానే తెలిసి వచ్చి ఉంటుంది. మరి ఓజి సినిమాలో ఈ పొరపాట్లను ఏ మేరకు సవరించుకున్నాడు అన్నది కొద్ది గంటల్లో తేలిపోతుంది.
– జురాన్ (@CriticZuran)