పేరుకి షార్ట్ ఫిల్మ్స్ గానీ… వాటి ప్రభావం చాలా ఉంది. షార్ట్ ఫిల్మ్స్ తీసి.. రాణించినవాళ్లు అది ఎంట్రీ కార్డుగా చూపించి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. హిట్లు కొడుతున్నారు. విరించి వర్మ నుంచి.. తరుణ్ భాస్కర్ వరకూ ఈమధ్య హిట్లు కొట్టిన యువ దర్శకులు చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వెండితెరపై అడుగుపెట్టినవాళ్లే. ఫ్రెష్ టాలెంట్ అక్కడే ఉంది అని గమనించిన దర్శకులు అక్కడ్నుంచి టాలెంట్ పిండేద్దామన్న ప్రయత్నాలు మొదలెట్టారు. ఈరోజు.. సుకుమార్, మారుతిల నుంచి రెండు వేర్వేరు ప్రకటనలు వెలువడ్డాయి. షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపండి.. గెలిచిన వాళ్లకు అవకాశాలిస్తామన్నది ఆ ప్రకటనల సారాంశం. ఇది వరకు పూరి కూడా ఇలాంటి ఆఫరే ఒకటిచ్చాడు.
వీటి వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతిభావంతుల్ని ప్రొత్సహిస్తున్నామంటూనే, వాళ్లని వాడేసుకోవడం అన్నమాట. చిత్రపరిశ్రమలో కథలకు కరువొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్ వస్తే గానీ ఆ లోటు భర్తీ కాదు. చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ బెస్ట్ అవుట్ పుట్తో వస్తున్నారు. కానీ వాళ్లకు ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావడం లేదు. నిజంగా అలాంటి వాళ్లకు ఇది శుభవార్తే. ఇందులో మరో పరమార్థం ఏమిటంటే.. మంచి కాన్సెప్టు అనుకొంటే.. దాన్ని సినిమాలుగా వాడేస్తారన్నమాట. ప్రతిభావంతులు కనిపిస్తే… వాళ్లకు దర్శకులుగా అవకాశాలిస్తారు. దానికి మారుతి బ్రాండో, సుకుమార్ బ్రాండో యాడ్ అయితే.. ఇక ఆ సినిమాకి బోల్డంత క్రేజ్ వస్తుంది. అంటే… ఈ ప్రకటనల వెనుక పూర్తిగా వ్యాపార దృక్పథం ఉందన్నమాట. గతంలో పూరి సాక్షి దినపత్రికతో కలసి షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ నిర్వహించాడు. అందులో గెలిచిన వాళ్లకు బహుమతులు ఇచ్చాడు గానీ… అవకాశాలైతే ఇచ్చింది లేదు. మరి వీళ్ల ప్రయత్నం కూడా ఇంతేనా?