ప్రజలను భయాందోళనలకు గురి చేసి.. తాము ఆనందపడే లక్షణాలు ఉండే విలన్ క్యారెక్టర్లతో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సైకోలు మన చుట్టూ చాలా మంది ఉన్నారని ఫేక్‌లను మించిన సైకో వార్తలు నిరూపిస్తున్నాయి. ఇదిగో బ్యారేజీ గేటు తెగిపోయిందని ఒకడు.. ఇదిగో బడమేరు విశ్వరూపం అని ఇంకొకడు.. చెలరేగిపోతున్నారు. పలానా ఊరి కోసం మీ ఊరును ముంచెత్తారని మరొకడు చెలరేగిపోతున్నారు. నిజం కన్నా అబద్ధమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందని వారు.. సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. వీళ్లను ఇలా వదిలితే సరిపోదని.. కేసులు పెట్టి ప్రభుత్వం వాళ్లకు సరైన స్థానం చూపించేందుకు సిద్ధమయింది.
సుమన్ టీవీ అతికి చెక్ పెట్టాల్సిన సమయం
సుమన్ టీవీ అతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తమ రాజకీయ బాస్ కోసం.. దిగజారిపోతోంది. బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయాయని ప్రచారం చేసింది. వాటిని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అసలు ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఎలాంటి సమస్యలు రాకుండా ఇలా ఎలా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారో కానీ.. ఇలా వదిలితే కష్టమని కేసులు పెట్టేశారు. ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేసి.. వర్షాల సమయంలో అలజడి రేపి వందల మంది మృతికి కారణమయ్యేలా కుట్ర చేసినట్లుగా సుమన్ టీవీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసులు పెట్టారు. చర్యలు తీసుకోబోతున్నారు.
అమరావతి వరదల్ని పొన్నూరుకు పంపించారట !.
సుమన్ టీవీ అతి ఇలా ఉంటే.. దాని బాబు లాంటి సాక్షి టీవీ అతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ..సాక్షి టీవీ పెద్దల్ని కాపాడుకునేందుకు వారు ఇలాంటి సైకో వార్తల్ని ప్రసారం చేయడానికి ఓ బకరా లీడర్ ను రెడీ చేసుకుంటారు. పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటి మురళీకృష్ణకు ఓ స్క్రిప్ట్ పంపించి దాన్ని చదవమన్నారు. ఆయన చదివేశాడు. దాన్ని సాక్షి పత్రికలో ప్రచురించేశారు. పెద్ద పెద్ద అక్షరాలతో. ఇంతకీ అదేమిటంటే.. అమరావతిలో పడిన వర్షం నీళ్లను పొన్నూరుకు వదిలారట. అందుకే పొన్నూరు మునిగిందట. ఇలాంటి కథలు కూడా రాయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమరావతి మునిగిందని ప్రచారం చేశారు. ఇప్పుడు మునగలేదని.. ఆ నీళ్లతో పొన్నూరును ముంచారని చెబుతున్నారు. అమరావతికి వచ్చే వరద నీళ్లన్నింటినీ కొండవీటి వాగు ప్రాజెక్టు ద్వారా.. కృష్ణానదిలోకి ఎత్తిపోశారు. మరి పొన్నూరుకు ఎలా వెళ్తాయి..?. ఇవన్నీ వాళ్లు ఆలోచించరు. తమకు కావాల్సిన సైకో తనాన్ని విస్తరింపచేయడమే వారి లక్ష్యం. అయితే ఇలాంటి వాటిని ఖండించి వదిలేది లేదని.. కేసులు పెడుతున్నారు.
ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి ఏం సాధిస్తారు ?
విపత్తుల సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఖచ్చితమైన సమాచారం ప్రజలకు చేరాల్సి ఉంది. కానీ అదేమీ లేకుండా.. ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని భయపెడితే చాలని అనుకుంటున్నారు. ఇలాంటి ఆందోళనల వల్ల ఏదైనా జరిగి పది మంది చనిపోతే తమ రాజకీయం తాము చేసుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ పది కుటుంబాల సంగతేమిటని ఆలోచించడం లేదు. ఇలాంటి సైకో రాజకీయాలపై.. సైకో న్యూస్ పై ఉక్కుపాదం మోపకపోతే అది మరింత వికృత రూపం దాలుస్తుంది.