Sundarakanda Movie Review
తెలుగు రేటింగ్: 2.75/5
విభిన్నమైన కథలు చేసే నారా రోహిత్ తన కెరీర్‌కి గ్యాప్ ఇచ్చారు. భైరవం ఆయన కమ్ బ్యాక్ సినిమా కాలేకపోయింది. ఇప్పుడు సుందరకాండతో వచ్చారు. ఇది ఆయన 20వ సినిమా కావడం మరో విశేషం. మరి ఈ సినిమాతో రోహిత్ కోరుకునే కమ్ బ్యాక్ దొరికిందా? ఈ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ అయ్యింది? ఈ ప్రేమకథలోని కొత్తదనం ఏమిటి?
సిద్ధార్థ్ (నారా రోహిత్) నలభైకి చేరువౌతుంటాడు. తనకి పెళ్లి సంబంధాలు చూసి చూసి ఇంట్లో వాళ్లు విసిగిపోతారు. కానీ ఒక్క అమ్మాయికి కూడా నచ్చదు. ఇలా నచ్చకపోవడానికి ఓ కారణం ఉంది. సిద్ధార్థ్ స్కూల్ డేస్‌లో వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్)ని ఇష్టపడతాడు. అయితే కొన్ని పరిస్థితుల వలన తన ప్రేమని నేరుగా చెప్పలేకపోతాడు. కానీ వైష్ణవి అంటే ఇష్టం అలానే ఉండిపోతుంది. వైష్ణవిలో చూసిన ఓ ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెదుకుతున్న సిద్ధార్థ్‌కి అలాంటి లక్షణాలతో ఐరా (రితీ వాఘుని) ఎదురుపడుతుంది. అయితే వీరి మధ్య ఒక జనరేషన్ ఏజ్ గ్యాప్ ఉంటుంది. అయినప్పటికీ సిద్ధార్థ్ తన మనసులో మాట ఐరాకి చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధార్థ్ కోరుకున్న క్వాలిటీస్ ఏమిటి? ఈ ఏజ్ గ్యాప్ ప్రేమకథకి ఇరు కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరికి ఇద్దరు కలిశారా లేదా? అనేది మిగతా కథ.
వినడానికే ఇబ్బందికరంగా, అసౌకర్యంగా, కాస్త వికృతంగా అనిపించే కొన్ని పాయింట్లు ఉంటాయి. సుందరకాండ కూడా అలాంటి పాయింటే. అయితే ఇలాంటి కథలకు మంచి ట్రీట్మెంట్ రాసుకుంటే ఇంటిల్లాపాది చూసే సినిమా అవుతుందని బ్రో డాడీ లాంటి సినిమాలు రుజువు చేశాయి. నిజానికి బ్రో డాడీ కథగా వింటే అంగీకరించలేని పాయింట్. కానీ ఒక లైటర్ వెయిన్ ట్రీట్మెంట్తో ఆ కథని మంచి ఫ్యామిలీ స్టోరీగా మలిచారు. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కూడా అదే బాటలో నడిచాడు. ఒక అన్‌కన్వెన్షనల్ పాయింట్ తీసుకొని ఫన్ కోటింగ్‌తో రొమాంటిక్ కామెడీగా సుందరకాండ ని ప్రెజెంట్ చేశాడు. ఈ ప్రయత్నం ఆకట్టుకునేలా కుదిరింది.
సిద్ధార్థ్ పెళ్లి చూపులు సన్నివేశంతో కథ మొదలౌతుంది. తనకు కావాల్సిన ఐదు క్వాలిటీస్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉండే హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ… ఎప్పుడైతే సత్య వైజాగ్ ఎపిసోడ్ మొదలౌతుందో, అక్కడి నుంచి ఈ కథకు ఫన్ గేర్ పడుతుంది. నిజానికి సత్య ఇందులో కామెడీ పండించడానికి ఒక ఉత్ప్రేరకంలా పని చేశాడు. సిద్ధార్థ్–ఐరా మధ్య సంభాషణలను ఫ్రెష్‌గా రాసుకున్నాడు దర్శకుడు. ఆ మాటలే ప్రేమకథకు ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చాయి. ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఊహించినదే అయినప్పటికీ సెకండ్ హాఫ్‌పై క్యూరియాసిటీని పెంచగలిగింది.
సుందరకాండలో కాన్ఫ్లిక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లోనే క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ని ముందుకు నడపాలంటే ఫన్నీ సిట్యూవేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫీల్ గుడ్ ఫాక్టర్ ఇవన్నీ సమపాళ్లలో తోడవ్వాలి. కొత్త దర్శకుడు వెంకటేష్ వీటిపై బాగానే వర్క్ చేశాడు. రాసుకున్న ప్రతి క్యారెక్టర్‌కి ఒక పే ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్లాడు. అది బాగా కుదిరింది.
నిజానికి ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. కొంచెం అటు ఇటు అయినా ఎబ్బెట్టుగా అనిపించే ప్రమాదం ఉంది. అయితే దర్శకుడు చాలా పరిణతి చూపించాడు. ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా కథనం నడిపాడు.
సుందరకాండలో మైనస్సులు లేకపోలేదు. ఇందులో పెద్దగా సన్నివేశ బలం ఉండదు. ఎక్కువగా డైలాగుల మీదే ఆధారపడిపోయాడు దర్శకుడు. ఒక దశలో మరీ లెక్చర్లు దంచేస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇందులో డైలాగులు చాలా జాగ్రత్తగా వినాలి. క్వాలిటీస్ కోసం పట్టుపట్టిన హీరో చివరికి తానే రాజీపడిపోతాడు. ఇదంతా మాటల వ్యవహారంగానే అనిపిస్తుంది. నారా రోహిత్ లాంటి స్ట్రాంగ్ వాయిస్ ఉన్న నటుడు ఉండటంతో క్లైమాక్స్ గట్టెక్కేస్తుంది కానీ నిజానికి సన్నివేశ బలం కనిపించదు.
సోలో తర్వాత మళ్లీ అలాంటి యూత్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు రోహిత్. తన పెర్ఫార్మెన్స్ కూల్‌గా ఉంది. ఒక రెండు ఫైట్లు ఉన్నాయి కానీ నిజానికి ఇలాంటి స్క్రిప్ట్‌కి అలాంటి గొడవలు అనవసరం. రితీ వాఘుని అందంగా, చలాకీగా కనిపించింది. తనది కథలో చాలా కీలకమైన పాత్రే. శ్రీదేవి విజయ్ కుమార్ ని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈశ్వర్ కి ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు లేదు. పైగా స్కూల్ యూనిఫాంలో అయితే చిన్న పిల్లలా ఉంది. సెకండ్ హాఫ్‌లో ఆమె క్యారెక్టర్ కు స్కోప్ దొరికింది. సత్య గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. తన స్ట్రైక్ రేట్ 100. తన క్యారెక్టర్లో ఇరవై డైలాగులు ఉంటే ఇరవయ్యీ నవ్విస్తాయి. వాసుకి క్యారెక్టర్ డీసెంట్‌గా ఉంది. నరేష్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తన ఈజ్ చూపించాడు.
లియాన్ జేమ్స్ మ్యూజిక్ కలిసొచ్చింది. డియర్ ఐరా పాట వినడానికి,చూడటానికి బావుంది. నేపథ్య సంగీతం లైవ్లీగా సాగింది. కెమెరా వర్క్ రోమ్కామ్ జానర్ తగ్గట్టుగా ప్లెజెంట్‌గా ఉంది. దర్శకుడు వెంకటేష్‌లో మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు. కథలో చాలా కీలకమైన విషయాలను కేవలం తన మాటలతోనే కన్వే చేయగలిగాడు. త్రివిక్రమ్ ప్రభావం తనపై చాలా ఉన్నట్టే కనిపిస్తోంది.
ఒక కొత్త పాయింట్‌తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలమైంది. సుందరకాండ ఈ లోటుని తీర్చగలిగింది. మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తున్న రోహిత్‌కి సుందరకాండతో ఆశించిన ఫలితం వచ్చినట్టే.
తెలుగు రేటింగ్: 2.75/5