మూడు స్క్రిప్టులు ఉన్నాయి… వాటి దుమ్ము దుల‌పాలి – సునీల్‌తో ఇంట‌ర్వ్యూ

హాస్య న‌టుడి నుంచి హీరోగా మార‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. కానీ హీరోగా నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టం. అలా నిల‌దొక్కుకోలేక మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా యూ ట‌ర్న్ తీసుకోవ‌డం ఇంకా క‌ష్టం. సునీల్ ప్ర‌స్తుతం అలాంటి క‌ష్టాల్లోనే ఉన్నాడు. క‌మెడియ‌న్‌గా స్టార్ హోదా అనుభ‌విస్తున్న‌ప్పుడే హీరో అయిపోయాడు. హిట్లూ కొట్టాడు. అయితే ఆ బండి ఎంతో కాలం స‌జావుగా న‌డ‌వ‌లేదు. స్పీడు బ్రేక‌ర్లు ప‌డ్డాయి. ముందుకు వెళ్ల‌డానికి మొరాయించింది. ఎన్ని రిపేర్లు చేసినా.. అడుగు వేయ‌డానికి చాలా మొహ‌మాట‌ప‌డింది. అందుకే బండిని యూట‌ర్న్ చేసుకున్నాడు. మ‌ళ్లీ ఎక్క‌డైతే త‌న సినీ జీవితం మొద‌లెట్టాడో మ‌ళ్లీ అక్క‌డికే తీసుకొచ్చాడు. కమెడియ‌న్‌గా మ‌ళ్లీ త‌న ప్ర‌యాణాన్ని మొద‌లెట్టాడు. న‌రేష్ న‌టించిన ‘సిల్లీ ఫెలోస్’ లో సునీల్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. ‘అర‌వింద స‌మేత‌’, ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ చిత్రాల్లోనూ సునీల్ న‌వ్వులు పంచ‌బోతున్నాడు. ‘సిల్లీ ఫెలోస్‌’ ఈ వారంలోనే విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా సునీల్ తో చిట్ చాట్‌.

* క‌మెడియ‌న్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు.. ఎలా అనిపిస్తోందిప్పుడు?

– కామెడీ పాత్ర‌లు నాకేం కొత్త కాదు. ఇర‌వై ఏళ్లుగా నా బాట అదే క‌దా? ఇప్పుడేం కొత్త‌గా అనిపించ‌డం లేదు. హీరో అయ్యాక కూడా `మిర‌ప‌కాయ్‌` లాంటి సినిమాల్లో కామెడీ చేశా. `వీడు హీరో అయిపోయాడు.. కామెడీ పాత్ర‌లు చేయ‌డేమో` అనుకుని న‌న్ను పిల‌వ‌లేదేమో. నేను మాత్రం కామెడీని దూరం చేసుకోలేదు. చేసుకోవాల‌ని కూడా అనుకోలేదు.

* మిర‌ప‌కాయ్ త‌ర‌వాత మ‌రి అలాంటి ఆఫ‌ర్లు రాలేదా?

– `ఖైది నెం.150` అడిగారు. కాక‌పోతే ఆ స‌మ‌యంలో డేట్లు స‌ర్దుబాటు చేయ‌డం చాలా క‌ష్ట‌మైపోయింది. వీడు గోల్డెహె… పూర్తి చేయాల్సి.. చాలా టైట్ పొజీష‌న్ లో ఉన్నాను. అవ‌కాశం వ‌చ్చినా.. వ‌దులుకున్న సినిమా ఏదైనా ఉందీ అంటే అది అదే.

* క‌మెడియ‌న్‌గా ఇప్పుడు సెట్లో ఎలాంటి మార్పులు చూస్తున్నారు?

– అంతా బాగానే ఉంది. ఇది వ‌ర‌క‌టిలానే అనిపిస్తోంది. చెప్పా క‌దా.. నాలో క‌మెడియ‌న్ అనేవాడు ఎప్పుడూ అలానే ఉన్నాడ‌ని. తెర‌పైనే కాదు.. బ‌య‌ట కూడా నేను న‌వ్విస్తూనే ఉంటా. కాబ‌ట్టి.. కామెడీ పాత్ర‌లు చేయడం కొత్త అనిపించ‌లేదు. న‌ట‌న విష‌యంలోనూ నాకెలాంటి తేడాలూ క‌నిపించ‌లేదు. త్రివిక్ర‌మ్ మాత్రం.. `వీడు మ‌ళ్లీ కామెడీ ఎలా చేస్తాడో` అని భ‌య‌ప‌డ్డాడ‌ట‌. కానీ నేను మాత్రం ఈజీగానే పాత్ర‌ల్లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేస్తున్నా.

* పారితోషికాలు కూడా బాగానే ముడుతున్నాయ‌ట‌..

– హీరోగా చేస్తున్న‌ప్పుడు ఒకే సినిమాపై దృష్టి పెట్టేవాడ్ని. ఇప్పుడు అలా కాదు క‌దా? సినిమా సినిమాకీ మ‌ధ్య విరామం ఉండేది. కొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సివ‌చ్చేది. ఇప్పుడు అలా లేదు క‌దా? మీర‌న్న‌ట్టు డ‌బ్బులు కూడా బాగానే ముడుతున్నాయి.

* మ‌ళ్లీ క‌థానాయ‌కుడిగా న‌టించ‌మ‌ని ఎవ‌రైనా అడిగితే…

– త‌ప్ప‌కుండా చేస్తా. ఇప్ప‌టికే రెండు మూడు క‌మిట్మెంట్స్ ఉన్నాయి. కాక‌పోతే క‌థ‌, క‌థ‌నాలు నాకు త‌గ్గ‌ట్టుగానే ఉండాలి. అందాల రాముడు, పూల రంగ‌డు త‌ర‌హా క‌థ‌ల‌కు ఓటేస్తా. రీమేక్‌లు న‌యం. ఎందుకంటే రిస్కు త‌క్కువ‌గా ఉంటుంది.

* సిల్లీఫెలోస్‌లో మీ పాత్రేమిటి?

– నేనో స‌హాయ పాత్ర‌లో క‌నిపిస్తా. మొద‌ట్నుంచి చివ‌రి వ‌ర‌కూ న‌వ్వించ‌డ‌మే నా ప‌ని. తెలుగులో పూర్తి స్థాయి వినోదాత్మ‌క చిత్రాలు బాగా త‌గ్గిపోయాయి. ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ స‌త్య నారాయ‌ణ లా.. ఆద్యంతం వినోదం పంచేవాళ్లు త‌క్కువైపోయారు. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు గారిది అదే స్కూలు. ఆయ‌న ఈ క‌థ‌ని డీల్ చేసిన విధానం బాగా న‌చ్చుతుంది. లాజిక్కులు ప‌ట్టించుకోక‌పోతే హాయిగా న‌వ్వుకోగ‌లిగిన సినిమా ఇది.

* న‌రేష్ తో కెమెస్ట్రీ ఎలా కుదిరింది?

– న‌రేష్‌తో ఇది వ‌ర‌కు కూడా కొన్ని సినిమాలు చేశా. తొట్టిగ్యాంగ్ లో క‌ల‌సి న‌టించాం. అత్తిలి స‌త్తిబాబు కూడా బాగా ఆడింది. సిల్లీ ఫెలోస్ కూడా అదే స్థాయిలో అల‌రిస్తుంది. శ్రీ‌కాంత్‌తో చేసిన `ఆడుతూ పాడుతూ` సినిమాలో నా పాత్ర‌కు చాలా మంచి పేరొచ్చింది. ఆ సినిమాకోసం శ్రీ‌కాంత్ గారికంటే నేనే ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సివ‌చ్చింది. సిల్లీ ఫెలోస్‌కూడా అంతే.

* హాస్య న‌టుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే… మీరు గ‌ట్టి పోటీని ఎదుర్కోవాల్సివ‌స్తోందేమో..?

– చిత్ర‌సీమ‌లో ఎంత‌మంది ఉన్నా, ఇంకెంత మంది వ‌చ్చినా ఎవ‌రి స్థానం వాళ్ల‌ది. ఎవ‌రూ ఎవ‌రికీ ప్ర‌త్యామ్నాయం కాదు. పోటీ అంత‌కంటే కాదు. రేలంగి, ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు తర‌వాత బ్ర‌హ్మానందం, కోట, బాబూ మోహ‌న్‌.. వీళ్లంతా వ‌చ్చాయి. ముందు త‌రం వాళ్ల స్థాయిని అందుకోలేక‌పోయినా… వాళ్ల స్థాయిలో న‌వ్వించారు. మేం కూడా అంతే.. వాళ్ల స్థాయిని అందుకోలేక‌పోయాం. కానీ మాకు త‌గిన పాత్ర‌లు మాకొచ్చాయి. న‌టుల్ని బ‌ట్టి పాత్ర‌లు సృష్టించారు. రావు గోపాల‌రావుకి రీప్లేస్ మెంట్ ఎక్క‌డుంది? ముంబై నుంచి ఎంత మంది విల‌న్ల‌ను దింపినా ఆయ‌న్ని భ‌ర్తి చేయ‌గ‌లిగామా?

* ద‌ర్శ‌క‌త్వం వైపు ఆశ ఉందా?

– త్రివిక్ర‌మ్‌తో పాటు నేను కూడా కొన్ని సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశా. అప్ప‌టి నుంచీ క‌థ‌లు త‌యారు చేసుకునే అల‌వాటు ఉండేది. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర మూడు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. వాటి దుమ్ము దుల‌పాలి. నేనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తానా, మ‌రొక‌రికి అవ‌కాశం ఇస్తానా? అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com