టాలీవుడ్లో కథానాయికల కొరత ఇప్పుడిప్పుడే తీరుతోంది. ఇది వరకటిలా… హీరోయిన్ల కోసం పడిగాపులు కాయడం లేదెవ్వరూ. అందుబాటులో ఉన్న కథానాయికలతో ఎడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే కొంతమంది హీరోల పేర్లు చెబితే.. నాయికలు ‘నో’ అంటున్నారు. స్టార్ హీరోయిన్లే కాదు, కొద్దో గొప్పో పేరున్న నాయికలు కూడా.. తప్పించుకొని తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితే సునీల్‌కి పట్టుకొంది. సునీల్ హీరో అయ్యాక.. అతని పక్కన స్టార్ హీరోయిన్లు ఎవ్వరూ నటించలేదు. ఓ మాదిరి కథానాయికలు కూడా.. సునీల్ పక్కన నటించడానికి ఆసక్తి చూపించడంలేదు. దాంతో.. కొత్తమ్మాయిల్ని వెదికి పట్టుకోవాల్సి వస్తోంది. పేరున్న హీరోయిన్లు లేకపోవడం సునీల్ సినిమా వసూళ్లపై పరోక్షంగా ప్రభావం చూపిస్తూ వస్తోంది. ప్రస్తుతం సునీల్ టూ కంట్రీస్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఎన్.శంకర్ దర్శకుడు. ఈ సినిమాలో అయినా కాస్త పేరున్న హీరోయిన్ ని తీసుకొందామని చిత్రబృందం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే.. ఈసారీ సునీల్ కి మొండిచేయే ఎదురవుతోంది. రెజీనాని సంప్రదిస్తే.. ‘సారీ’ చెప్పేసిందట. రాశీఖన్నా దగ్గరకు వెళ్తే.. ‘ఖాళీ లేదు’ అనేసిందట. లావణ్య త్రిపాఠీని కూడా ట్రై చేసి నో అనిపించుకొన్నారని తెలుస్తోంది. దాంతో మళ్లీ కొత్తమ్మాయిల కోసం అన్వేషణ తప్పడం లేదు. సునీల్ – శంకర్ల సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చి నెలన్నర కావొస్తోంది. ఈరోజే ఈసినిమా పట్టాలెక్కింది. అయినా ఇంత వరకూ కథానాయిక ఎవరన్నది తేలలేదు.ఈసారీ కొత్త మొహమే చూసుకోవాలేమో??