మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కేసు విచారణకు సంబంధించి సిబిఐ కోర్టు దర్యాప్తు కొనసాగంచడానికి అవకాశం ఇచ్చినా కీలక అంశాలపై మాత్రం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామం వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డికి నిరాశ కలిగించింది. ఆమె హైకోర్టుకు వెళ్లే ఆలోచనచేస్తున్నారు.
వివేకా చనిపోయినట్లుగా ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆరున్నర తర్వాత గుర్తించారు. కానీ జగన్ కు, ఆయన సతీమణికి ఐదున్నర గంటలకే తెలిసిందని సీబీఐ గుర్తించింది. సీబీఐ కోర్టు ఈ టైమింగ్ ను అర్థం చేసుకోలేకపోయిందని.. చనిపోయాడని తెలిసిన దగ్గర బంధువులకు సమాచారం ఇవ్వడం సహజమేనని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కానీ ఎవరికీ తెలియక ముందే ఆ ఫోన్ చేసిన వారికి ఎలా తెలిసింది.. వారు జగన్ కే ముందు ఎందుకు చెప్పారన్నది అంతు చిక్కని ప్రశ్న. దానిపై దర్యాప్తు అవసరం లేదని తీర్పు ఇవ్వడంతో సునీత ఈ కేసులో చిక్కుముడి వీడాలంటే హైకోర్టుకు వెళ్లి ఆంక్షల్లేని దర్యాప్తు కోరాలని అనుకుంటున్నారు.
విచారణలో పారదర్శకత ఉండాలని, కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో కోరనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ కేసులో ఉన్న రాజకీయ కోణాలను, ఇప్పటికే వెలుగులోకి వచ్చిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని, దర్యాప్తుపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఆమె హైకోర్టును కోరే అవకాశం ఉంది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు మొదట సుప్రీంకోర్టు గడువు పెట్టింది. సుదీర్ఘ పోరాటం తర్వాత దర్యాప్తు కొనసాగించడానికి దిగువకోర్టు తీర్పు ఇచ్చినా ఆంక్షలు పెట్టడంతో ఈ కేసు దర్యాప్తు ఎటూ తేలకుండా ఉండిపోతోంది.
