వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత తెలుగు రాష్ట్రాల్లో ఒక ముగింపు లేని మిస్టరీలా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతారెడ్డి మధ్య జరుగుతున్న ప్రెస్ మీట్ ల యుద్ధం ప్రజల్లో గందరగోళాన్ని పెంచుతోంది. ఒకరు సాక్ష్యాధారాలను చూపిస్తుంటే, మరొకరు కుట్ర కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. వీరిద్దరూ ఒకే బహిరంగ వేదికపై ముఖాముఖి చర్చకు వస్తేనే అసలు నిజాలు బయటపడతాయి.
మీడియా ద్వారా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న సునీత, అవినాష్ రెడ్డి
సునీతారెడ్డి తన తండ్రి హత్య వెనుక జగన్ తో సహా పలువురు కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణలో వెల్లడైన అంశాలను, గూగుల్ టేక్ అవుట్ వివరాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, అవినాష్ రెడ్డి ఆ లేఖను ఎందుకు దాచారు? అసలు హంతకులను వదిలేసి తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మీడియా ద్వారా విడివిడిగా విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలు ఎవరి వాదనను నమ్మాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఒక వేదికపై ఈ ప్రశ్నలన్నింటికీ సూటిగా సమాధానం చెప్పుకుంటే, ఎవరి మాటల్లో తడబాటు ఉందో, ఎవరి దగ్గర వాస్తవాలు ఉన్నాయో స్పష్టమవుతుంది.
ముఖాముఖి చర్చకు వస్తే ప్రజలకు క్లారిటీ
కానీ ప్రజాక్షేత్రంలో వారి విశ్వసనీయతకు ఇది అత్యంత కీలకం. ఒకరు రక్తం కళ్లచూసిన హంతకులు అని, మరొకరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న డ్రామాలు అని విమర్శించుకుంటున్న తరుణంలో.. సాక్ష్యాలతో కూడిన ముఖాముఖి చర్చ జరిగితే, తెరవెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు కూడా బహిర్గతమవుతాయి. ప్రజలకు కేవలం వార్తా కథనాలే కాకుండా, నిందితుల హావభావాలు , సమాధానాల ద్వారా ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
చర్చ కుదరనకుుంటే సైలెంట్ గా ఉండటమే బెటర్
వివేకా హత్య కేసు కేవలం ఒక నేర విచారణగానే కాకుండా, రాజకీయ అస్త్రంగా మారిపోయింది. ప్రెస్ మీట్లు పెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నాల కంటే, సాక్ష్యాధారాల మధ్య జరిగే సంవాదమే నిజమైన క్లారిటీని ఇస్తుంది. సునీతారెడ్డి సంధిస్తున్న ప్రశ్నలకు అవినాష్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా? లేదా అవినాష్ లేవనెత్తుతున్న అనుమానాలకు సునీత వద్ద వివరణ ఉందా? అన్నది తేలాలంటే వేదిక ఏదైనా చర్చ మాత్రం ప్రత్యక్షంగా జరగాల్సిన అవసరం ఉంది. అది కరెక్ట్ కాదనుకుంటే.. ఇక అంతా కోర్టుకు వదిలేసి సైలెంట్ గా ఉండటం బెటర్.
