సండే అంటేనే వినోదం.. రిలాక్సేషన్.. టైమ్ పాస్. ఈ సండే వీటికి ఢోకా లేదు. ఎందుకంటే ఈ ఆదివారం కావల్సినంత వినోదం దొరకబోతోంది. ఉదయం పది గంటలకు ఓజీ ట్రైలర్ వస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తమ హీరోని సుజిత్ ఎలా చూపిస్తాడా, డైలాగులు ఎలా ఉంటాయా, ఎలివేషన్లు ఎన్నుంటాయో అని ఊహల్లో తేలిపోతున్నారు. ఓజీ టీజర్ తో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అసలు ఈ సినిమా పై ఇన్ని అంచనాలు పెరగడానికి టీజరే కారణం. టీజర్లోనే అంత విధ్వంసం చూపించాడంటే ఇక ట్రైలర్లో ఇంకేం చేస్తాడో అని వెయిటింగ్. సాయింత్రం ఎల్ బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. పవన్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్. ఈ ట్రైలర్, ఈవెంట్ తో.. ప్రమోషన్స్ పీక్స్ కి వెళ్లిపోయినట్టే.
ఓవైపు ఓజీ హడావుడి జరుగుతుండగానే, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ మొదలైపోతుంది. ఆసియా కప్‌లో భాగంగా సూపర్ 4 సమరానికి చిరకాల ప్రత్యర్థులు సన్నద్ధమయ్యారు. లీగ్ మ్యాచ్‌లో పాక్‌ని భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. సూపర్ 4లో కూడా మన జట్టే ఫేవరెట్. భారత్ పై గెలవాలంటే పాక్ అద్భుతాలు చేయాల్సిందే. పాక్‌తో పోలిస్తే.. భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడు మ్యాచ్‌లలో గెలిచి సూపర్ ఫామ్ లో ఉంది. పాక్ గెలవాలంటే అద్భుతాలు చేయాల్సిందే. భారత్ – పాక్ సమరం అంటే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. పైగా ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆ వేడి మరింత రాజుకొంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఫైనల్ చేరిపోయింది. పాక్ పై గెలిస్తే.. ఆసియా కప్ ఇంటికి తీసుకురావడం ఏమాత్రం కష్టం కాదు.