800 రూపాయలు తక్కువైన కాంగ్రెస్‌

Telakapalli-Raviకాంగ్రెస్‌ పార్టీ అంటే ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన ప్రథమ రాజకీయ పార్టీ. దేశంలో రాష్ట్రాలలో చక్రం తిప్పిన నేతలెందరో ఆ పార్టీలో వుండటమే కాదు..సంపన్న వర్గాలతో సంబంధాలకు పెట్టింది పేరు. ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ తల్చుకుంటే వనరుల కొరత వుంటుందని ఎవరూ భావించరు. అలాటి పార్టీ అత్యంత కీలకమైన సమయంలో 800 రూపాయలు కట్టలేక అత్యున్నత న్యాయస్థానంలో అక్షింతలు వేయించుకోవడం ఆశ్చర్యం అనిపించదూ? హైదరాబాద్‌ గాంధీ భవన్‌ నుంచి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం వరకూ జీతాల చెల్లింపులపైనే ఫిర్యాదులు వున్నప్పుడు ఇదేమంత ఆశ్చర్యం? కాంగ్రెస్‌ నాయకులు సంపన్నులైనంత మాత్రాన పార్టీకోసం దేశం కోసం ఖర్చు చేయాలని వుందా?

ప్రస్తుత విషయానికి వస్తే అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కాంగ్రెస్‌ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. అక్కడ కొందరు బిజెపి వైపు ఫిరాయించడం, స్పీకర్‌పై అవిశ్వాసం వంటివి అవకాశంగా తీసుకుని గవర్నర్ రాజ్‌ఖోవ్‌ జోక్యం చేసుకున్నారు. శాసనసభ ముందుగా జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఏకపక్షంగా ఆదేశిస్తే పాటించనవసరంలేదని అక్కడున్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నబమ్‌ తుఖీ బదులిచ్చారు. అయితే ఆరునెలల లోగా శాసనసభను సమావేశపర్చలేదన్న నిబంధనను చూపించి గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఒక ప్రభుత్వానికి మెజార్టి వుందీ లేనిదీ తేలవలసింది సభా వేదికపైనే అనే ఎస్‌ఆర్‌బొమ్మై కేసులో తీర్పును అమలు జరపాల్సిన సందర్భమిది. ఆ సమయాన్ని కూడా పరస్పరం సంప్రదించుకుని నిర్ణయించాలి తప్ప ఏకపక్షంగా ఆదేశించే అవకాశం లేదు. అలా గవర్నర్‌ల కార్యాలయాలను కాంగ్రెస్‌ అనేకసార్లు దుర్వినియోగం చేసింది. ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది గనక దానికే ఈ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. అయితే ఇందుకోసం కోర్టుకు చెల్లించాల్సిన ఫీజు 800 రూపాయలు తక్కువ చెల్లించినందుకు మందలించింది. ‘ఇప్పుడే కట్టేశాము’ అని వారు చెప్పినప్పుడు కాస్త హేళనగా మాట్లాడింది. పిటిషన్‌ తయారు చేసేందుకు వాడిన ఫాంటు కూడా సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది.

అయితే రాజకీయంగా మాత్రం ఈ సమస్యను తక్షణం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించేందుకు అంగీకరించడం మోడీ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైంది. మధ్యాహ్నం నుంచి జరుగుతున్న విచారణలో తుది తీర్పు ఎలా వుంటుందో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com