వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. సునీతతో పాటు సీబీఐ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాలను సుప్రీంకోర్టు అడిగింది.
దర్యాప్తు ఇంకా అవసరమని సీబీఐ భావిస్తోందా..?, కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ పై ఏమనుకుంటున్నారు?, కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా? అన్న అంశాలపై అభిప్రాయాలు చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే ఎప్పటికి వాయిదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.
వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు పెట్టింది. ఆ గడువు వరకు విచారణ జరిగింది. అప్పటి నుంచి దర్యాప్తు ఆగిపోయింది . కేసు విచారణ ఆగిపోయింది. నిందితులకు బెయిల్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు వారు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ తదుపరి దర్యాప్తు, ట్రయల్ పై ఏం చెబుతుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది..