చాలా కాలంగా ఆజ్ఞాతంలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. సుప్రీంకోర్టులో ఊరట దక్కుతుందని ఆ తర్వాత బయటకు వచ్చి తొడ కొట్టాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో కేసులు పెట్టినా సరే ఇక్కడే ఉంటానని చాలెంజ్ చేశారు. కానీ కేసులు పెట్టి అరెస్టు చేస్తారనే సరికి కనిపించకుండా పోయారు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు.
ఆజ్ఞాతంలో ఉండి న్యాయపోరాటం చేశారు. దిగువ కోర్టుల్లో అనకూల ఫలితం రాకపోయే సరికి ఎగువ కోర్టుకు వెళ్లారు. చివరికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఎక్కడా అనుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరవడం మినహా మార్గం లేదు. హాజరు కాగానే అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతారు. ఒక వేళ హాజరు కాకపోయినా పట్టుకొస్తారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసినందున విదేశాలకు పారిపోయి ఉండరని ఇండియాలోనే ఎక్కడో దాక్కున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు పట్టుకోవాలనుకుంటే కాకాణి ఎక్కడున్నా పట్టుకొస్తారు. అందులో సందేహం ఉండదు. తాను ఎక్కడున్నానో పోలీసులకు తెలియని అనుకోవడం కాకాణి భ్రమ. ఆయనకు న్యాయపరమైన అవకాశాలు ఇవ్వడానికి మాత్రమే ఇంత కాలం చూసీ చూడనట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు.. అమ్మకాల కేసుల్లో ఆయన నిందితుడు.