భారత రియల్ ఎస్టేట్ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చే కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. గృహ హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. జస్టిస్ జెబి పార్దివాలా , జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ తీర్పును రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలపై దివాలా కేసుల సందర్భంగా వెలువరించింది. లక్షలాది పౌరులు తమ జీవిత సంపాదనను పెట్టుబడిగా పెట్టినప్పటికీ గృహాలు లేకుండా ఉండటాన్ని ప్రభుత్వం చూస్తూ ఉండకూడదని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్స్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ల బలోపేతం కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది.
సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు పెట్టుబడి పెట్టిన వారు, ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండటంతో నెలవారీ వాయిదాలు, అద్దె రెండూ చెల్లించే డబుల్ భారాన్ని మోస్తున్నారు. ఇల్లు విలాసం కాదు, గౌరవం, ఉత్పాదకత , ఆరోగ్యంతో ముడిపడిన ప్రాథమిక అవసరమని ధర్మాసనం పేర్కొంది. సురక్షితమైన, శాంతియుతమైన, సకాలంలో గృహ స్వాధీనం ఆర్టికల్ 21 కింద జీవన హక్కులో భాగమని తీర్పు చెప్పింది.
ప్రతి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నిపుణులు, వనరులతో సిబ్బంది ఉండాలని, కనీసం ఒక సభ్యుడు రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం కలిగిన లీగల్ ఎక్స్పర్ట్ లేదా కన్స్యూమర్ అడ్వొకేట్ అయి ఉండాలని కోర్టు ఆదేశించింది. అనుమతులు ఇవ్వడంలో లేదా పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్ల అన్యాయం జరిగితే అది క్షమించరాని తప్పిదమని హెచ్చరించింది. రెసిడెన్షియల్ లావాదేవీలు ఆస్తి ధరలో కనీసం 20 శాతం చెల్లించిన తర్వాత స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద తప్పనిసరిగా నమోదు కావాలని, భూమి సేకరణ లేదా నిర్మాణం ప్రారంభం కాని ప్రాజెక్టుల కోసం సేకరించిన నిధులు ఎస్క్రో ఖాతాలో ఉంచాలని, రెరా-ఆమోదిత నిర్మాణ ప్రణాళికలకు అనుగుణంగా దశలవారీగా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి అధ్యక్షతన హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందులో న్యాయ, గృహ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, ఐఐఎంలు, నేషనల్ లా యూనివర్శిటీలు, ఇండస్ట్రీ ప్రతినిధులు ఉండాలని ఆదేశించింది. ఈ కమిటీ ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించే సంస్కరణలను సిఫారసు చేయాలని తెలిపింది.
రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో.. ప్రజలు వేల కోట్లు నష్టపోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో.. మోసాలకు అడ్డుకట్టపడేలా సమగ్రమైన విధానాన్ని తీసుకు వస్తే.. ప్రజలు సంతోషిస్తారు. మోసాల బారిన పడకుండా ఉంటారు.
