తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైనా పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో విచారణలో ఉంటే సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. గత విచారణలో హైకోర్టు స్టే ఇవ్వలేదని అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని వారు తెలిపారు. అయితే స్టే రాకపోతే పిటిషన్ వేస్తారా…హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై తాము ఎలా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిన్ ను కొట్టి వేసింది.
రిజర్వేషన్లను పెంచుతూ జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. అందులో రిజర్వేషన్లను బీసీలకు 42 శాతం కేటాయించారు. ఈ కేటాయింపు వల్ల సుప్రీంకోర్టు నిర్దేశించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి దాటిపోతోందని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. అప్పటికి షెడ్యూల్ విడుదల కాలేదు. అందుకే ఎలాంటి స్టే ఇవ్వలేదు.
ఈ కారణం చెప్పి పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఎనిమిదోతేదీన హైకోర్టులో జరగబోయే విచారణే కీలకం. ఆ రోజున కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారా లేదా అన్నది తేలే అవకాశం ఉంది.