50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము జారీ చేసిన జీవో ప్రకారం 67 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి. ఈ జీవోలు ప్రకారమే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు జీవోపై స్టే ఇచ్చింది. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని .. ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్లో17 శాతం ఓపెన్ గా ప్రకటించి ఎన్నికలు జరుపుకోవాలని సూచించింది. అయితే ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ ఊరట దక్కలేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన ఉంటుంది.అంతకుమించిన మార్గం కూడా లేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడినా ప్రయోజనం లేకపోయిందని.. తమ ప్రయత్నాలను ఇతర పార్టీలు అడ్డుకున్నాయని కానీ తాము మాత్రం.. పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు చెప్పి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.