ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తు తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ ప్రభావం వల్ల దర్యాప్తు నీరుగారకుండా ఉండేందుకు, హైకోర్టు తరపున ఒక సీనియర్ న్యాయాధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలని సూచించింది.
సాక్షులను బెదిరిస్తే బెయిల్ రద్దు!
ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షులను భయపెట్టాలని చూసినా, లేదా దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా తక్షణమే బెయిల్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు నిందితుడికి సహకరించేలా వ్యవహరించారని, 90 రోజుల గడువు ముగిసిన తర్వాతే చార్జ్‌షీట్ దాఖలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని బాధితుల తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
దర్యాప్తు చేతగాకపోతే సీబీఐకి అప్పగింత
దర్యాప్తు సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి వెన్నుదన్నుగా నిలిచేలా పోలీసులు వ్యవహరించడం చట్ట విరుద్ధం అని పేర్కొంది. కేసులో అసలు నేరస్తులకు శిక్ష పడటంతో పాటు, ఆధారాలను ధ్వంసం చేయడంలో సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డీజీపీ, ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. దర్యాప్తు చేతకాపోతే సీబీఐకి అప్పగిస్తామని హెచ్చరించింది.
సిట్ దర్యాప్తుకు మరింత బలం
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిట్ దర్యాప్తుకు మరింత బలం చేకూరినట్లయింది. ఇటీవల దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో అనంతబాబు భార్యను కూడా నిందితురాలిగా చేర్చడం ఈ కేసులో మరో కీలక మలుపు. సుప్రీంకోర్టు తాజా నిఘా ఆదేశాలతో ఈ హత్య కేసులో తెర వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారుల చిక్కుముడి త్వరలోనే వీడనుంది.
