జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ రస్ అల్ ఖైమా ప్రభుత్వ సంస్థ రాకియాను అడ్డగోలుగా మోసం చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్నారు. రాకియా వద్ద తీసుకున్న పెట్టుబడులు జగన్ రెడ్డి కంపెనీల్లోకి మళ్లీంచి.. రాకియాను మోసం చేశారు. ఆ కంపెనీ న్యాయపోరాటం చేస్తోంది. రూ.60౦ కోట్లు చెల్లించాలని రస్ అల్ ఖైమా కోర్టు తీర్పు ఇస్తే.. అమలు చేయడం లేదు. అమలు చేయాలని ఇక్కడి కోర్టులో వారు పిటిషన్లు వేశారు. దీంతో నిమ్మగడ్డ తన పేరుపై ఆస్తులేమీ లేకుండా…బినామీల పేర్ల మీదకు మార్పించుకుంటున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో యథాతథ స్థితిని విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
నిమ్మగడ్డతో పాటు కుమార్తె, అల్లుడి ఆస్తులపై యథాతథ స్థితి
నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన కుమార్తె, అల్లుడు ప్రణవ్ రెడ్డిలతో పాటు మ్యాట్రిక్స్ ల్యాబ్స్ ఆస్తులపై యథాతథ స్థితి ప్రకటిస్తూ.. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించింది. రాకియా వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వివాదాస్పద ఆస్తి బదిలీలు, వాటా మార్పులను నిలిపివేసింది. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ కోర్టులో ఉంది. విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రసాద్ ఆస్తులు బినామీల పేరు మీదకు మళ్లిస్తున్నారనే కంటెంప్ట్ కేసు కూడా ఉంది. నిమ్మగడ్డ రాకియా సంస్థ పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వకుండా.. న్యాయస్థానాలను సైతం మభ్యపెట్టేందుకు తన ఆస్తులన్నింటినీ ఇతరుల పేరు మీద బదిలీ చేస్తున్నారు.
తమ పెట్టుబడుల కోసం వెంట పడుతున్న రాకియా
వాన్ పిక్ ప్రాజెక్టు లో రాకియా పెట్టుబడులు పెట్టింది. ఆ పెట్టుబడులను నిమ్మగడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లోకి మళ్లించారు. వైఎస్ చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తాను నిమ్మగడ్డ చేసిన మోసం వల్ల రూ. 2,500 కోట్లు నష్టపోయానని తెలంగాణ హైకోర్టులో రాకియా కేసు వేసింది. ఆగస్టు 30, 2019న సెర్బియా లో ప్రసాద్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రాకియా ఫిర్యాదు మీద ఇంటర్‌పోల్ సహాయంతో జరిగింది. కరోనా వల్ల ఖైదీలందర్నీ విడుదల చేయడంతో ఆయన బయటకు వచ్చారు.
నిమ్మగడ్డ వద్ద ఆస్తులేమీ లేవని వాదిస్తున్న నిరంజన్ రెడ్డి
విచిత్రం ఏమిటంటే.. మ్యాట్రిక్స్ లో అసలు నిమ్మగడ్డకు వాటాలు లేవని.. అలాగే ఇతర సంస్థల్లోనూ ఆయనకు వాటాలు లేవని నిమ్మగడ్డ తరపు లాయర్లు వాదిస్తున్నారు. అంటే అన్నీ ఇప్పటికే మార్పించేశాని చెప్పకనే చెబుతున్నారు. కానీ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. మ్యాట్రిక్స్ తో పాటు ఆయన కుమార్తె, అల్లుడి ఆస్తులపై కూడా యథాతథ స్థితిని ప్రకటించారు. డిసెంబర్ లో తదుపరి విచారణ జరగనుంది.
