తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు

మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు జాతీయ ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాయి. ప్రస్తుతం ఊహాజనితమయిన మత అసహనంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతం ఆ కోవకు చెందినదే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల పట్ల తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ పోటా పోటీగా సానుభూతి చూపడం కూడా ఆ కోవకు చెందినదేనని చెప్పవచ్చును. మన దేశ ప్రధానమంత్రిని అతి దారుణంగా హత్య చేస్తే, అందుకు కారకులయిన వారిని శిక్షించమని కోరకపోగా మరణశిక్ష పడిన వారిని విడిచిపెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కృషి చేయడం చూసి దేశప్రజలు అందరూ విస్మయానికి గురవుతున్నారు.

ఈ హత్య కేసులో దోషులు అందరూ శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ఎల్.టి.టి.ఈ. ఉగ్రవాద సంస్థకు చెందినవారు. కనుక వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యవహరించినా రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకు కోల్పోతామనే ఆలోచనతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలు పడిన వారినందరినీ జైలులో నుండి విడుదల చేసేందుకు పోటీలు పడుతున్నాయి. దేశ ప్రధానిని హత్యచేసినవారయినా వారి వలన తమకి లాభం కలుగుతుంది అంటే వారిని సమర్ధించేందుకు తమిళనాడులో రాజకీయ పార్టీలు సిద్దపడటం చాలా సిగ్గు చేటు.

వారి ప్రయత్నాలని సుప్రీం కోర్టు నిర్ద్వందంగా తిప్పికొడుతూ ఈరోజు తీర్పు చెపింది. యావజ్జీవ కారాగార శిక్ష పదిన తొమ్మిది మంది రాజీవ్ గాంధీ హంతకులను తమిళనాడు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టింది, తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. అటువంటి కేసులలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకొనే వీలు లేదని విస్పష్టంగా చెప్పింది. దానిపై కేంద్ర ప్రభుత్వానికి తప్ప మరెవరికీ నిర్ణయం తీసుకొనే హక్కు లేదని తేల్చి చెప్పింది. కేంద్రం అనుమతి లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని, దోషులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి వీలు లేదని వారందరూ తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com