మత మార్పిడి చేసుకున్న వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల హోదాను కొనసాగించడంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా రాజకీయ , సామాజిక వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం.. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణనలోకి వస్తారని రాజ్యాంగ నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం వ్యక్తిగత హోదాకే పరిమితం కాకుండా, ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అసలైన లబ్ధిదారుల రాజకీయ అవకాశాలను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది.
అర్హుల అవకాశాలకు గండి
రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చాలామంది అభ్యర్థులు రికార్డుల్లో హిందూ ఎస్సీ లుగా ఉంటూ, వ్యక్తిగత జీవితంలో ఇతర మతాలను ఆచరిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీని వల్ల నిబద్ధతతో హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న మాల, మాదిగ ,ఇతర అనుబంధ కులాల అభ్యర్థులకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదు. మతం మారిన వారు ఆర్థికంగా, విద్యాపరంగా కొంత మెరుగైన స్థితిలో ఉండటంతో, రిజర్వ్డ్ సీట్లలో వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల స్పూర్తికే విరుద్ధమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ద్వంద్వ గుర్తింపుతో మత కల్తీ
బయటకు హిందువులుగా చెప్పుకుంటూ, అంతర్గతంగా క్రైస్తవ మతాన్ని పాటించడం అనేది మతాల కల్తీ కిందకు వస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించినప్పుడు ఆ మత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి, కానీ కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం పాత గుర్తింపును వాడుకోవడం నైతికంగా, చట్టపరంగా తప్పని సుప్రీంకోర్టు తీర్పు పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఈ డ్యూయల్ ఐడెంటిటీ వల్ల నిజమైన దళితులు విద్య, ఉద్యోగ , రాజకీయ రంగాల్లో వెనుకబడిపోతున్నారు.
ప్రభుత్వాలు ఇలాంటి వారిని గుర్తించాల్సిందే!
ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత పెరిగింది. మతం మారి కూడా ఎస్సీలుగా చలామణి అవుతున్న వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వేలు నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామ సభలు, స్థానిక విచారణల ద్వారా అభ్యర్థుల వాస్తవ మత స్థితిగతులను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ప్రభుత్వాలు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. కేవలం సర్టిఫికేట్లు మాత్రమే కాకుండా, అభ్యర్థుల సామాజిక , మతపరమైన నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై కూడా ఉంది. అనర్హులు రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నప్పుడే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
న్యాయపరమైన చిక్కులు
ఈ తీర్పుతో గతంలో ఎస్సీ హోదాతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవులపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. ఎవరైనా తమ ప్రత్యర్థి మతం మారినట్లు ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తే, వారి ఎన్నిక చెల్లకుండా పోయే అవకాశం ఉంది. ఇక నుంచి ఇలాంటి పిటిషన్లు కోర్టుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కానీ వారు మతం మారినట్లుగా నిరూపించడమే కీలకం.
