రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై భాదిత పార్టీలు స్పీకర్లకి, గవర్నర్ నరసింహన్ కి మోర పెట్టుకొన్నా వారు పట్టించుకోలేదు. తెలంగాణాలో జరిగిన ఫిరాయింపులపై హైకోర్టుకి పిర్యాదు చేస్తే అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశమని, కనుక ఆ వ్యవహారంలో కలుగజేసుకోలేమని చేతులు ఎత్తేసింది. కనుక బాధిత పార్టీలు సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి. ఏపిలో వైకాపా తరపున ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని స్పీకర్లని ఆదేశించవలసిందిగా వారు తమ పిటిషన్లలో న్యాయస్థానాని కోరారు. కేవలం పార్టీలు, రాష్ట్రాలు వేరు తప్ప రెండు పిటిషన్లు ఒకే రకమైనవే. కానీ సుప్రీం కోర్టు వాటిపై భిన్నంగా స్పందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
జూలై 8న మేకపాటి పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, ఇది స్పీకర్ పరిధిలో ఉన్న అంశమని దానిలో తాము కలుగజేసుకోలేమని, ఈ సమస్య పరిష్కారం కోసం హైకోర్టుని ఆశ్రయించడం మంచిదని సూచించింది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేసిన పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూధనాచారికి, పార్టీ ఫిరాయించిన సదరు ఎమ్మెల్యేలకి 3వారాలలోగా సంజాయిషీలు ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఒకే రకమైన కేసులో సుప్రీం కోర్టు రెండు రకాలుగా స్పందిస్తే, హైకోర్టు మాత్రం ఆంధ్రా, తెలంగాణా భాదిత పార్టీల ప్రతినిధులు దీని కోసం వేసిన పిటిషన్లపై ఒకే రకంగా స్పందించింది. స్పీకర్ల పరిధిలో ఉన్న ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనే అధికారం తమకి లేదని విస్పష్టంగా చెప్పింది