మెగా హీరోలతో సినిమా చేసే దర్శకులకు ఓ సౌలభ్యం ఉంది. ఒకరితో ట్యూన్ అయితే చాలు.. ఆ ఫ్యామిలీలోని అందరు హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తుంటుంది. అలా మెగా ఫ్యామిలీకి ట్యూన్ అయిపోయాడు సురేందర్ రెడ్డి. అల్లు అర్జున్‌తో తీసిన రేసుగుర్రం మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో ధృవ తెరకెక్కించాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్టయితే… మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసినట్టే. మరోవైపు చిరంజీవి కూడా సురేందర్‌రెడ్డితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. `నాకు సరిపడా కథేమైనా ఉందా?` అంటూ చిరు సురేందర్‌రెడ్డిని అడిగాడట. ఈ విషయాన్ని సురేందర్ రెడ్డి ధృవీకరించాడు కూడా.
”చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి మేం ఇద్దరం మాట్లాడుకొన్నాం కూడా. ఆయనకు సరిపడ కథ నా దగ్గర సిద్దంగా ఉంది. బహుశా వచ్చే యేడాది ఈ సినిమా ఉండొచ్చు” అంటున్నాడు సూరి. చిరంజీవి కోసం యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తాడట. ”చిరంజీవిగారికి కిక్ అంటే చాలా ఇష్టం. ఆ తరహా సినిమా చేయాలని వుంది.. అయితే ఎలాంటి కథ చేయాలి అనే విషయం ఆయనతో నేను మాట్లాడలేదు” అంటున్నాడు సూరి. చిరు 151వ చిత్రం బోయపాటి శ్రీను చేతిలో పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమీకణాలు మారితే… చిరు సినిమా సురేందర్ రెడ్డితో ఉండొచ్చు. ఈ కాంబినేషన్ పట్టాలెక్కాలంటే ముందు ధృవ బ్లాక్ బ్లస్టర్ హిట్ అవ్వాలి. అయితే… మెగాస్టార్ – సూరి కాంబినేషన్ సెట్టయిపోయినట్టే.