హీరోల పారితోషికాలకూ, వాళ్ల రీసెంట్ ఫామ్ కీ ఏమాత్రం సంబంధం లేకుండా పోతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో. ఓ హీరో నిర్మాతకు డేట్లు ఇవ్వడమే గొప్ప.. అనుకొనే రేంజ్లో నిర్మాతలు ఆలోచిస్తున్నారేమో? అనిపిస్తోంది. సూర్య విషయంలో ఇదే జరుగుతోంది. సూర్యకు నికార్సయిన హిట్ పడి చాలా కాలం అయ్యింది. ‘కంగువా’ సూర్య కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్. రీసెంట్ గా వచ్చిన ‘రెట్రో’ కూడా అభిమానుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇలా వరుసగా రెండు పెద్ద ఫ్లాప్స్ ఇచ్చిన తరవాత సూర్య రెమ్యునరేషన్ డౌన్ అవ్వాలి. కానీ తన తదుపరి సినిమాకు రూ.50 కోట్లు తీసుకొంటున్నాడు సూర్య.
సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు గానూ సూర్య రూ.50 కోట్లు అందుకొంటున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. `రెట్రో` రిలీజ్కు ముందే ఈ పారితోషికం ఫిక్సయ్యింది. కాబట్టి ‘రెట్రో’ ఫ్లాప్ ప్రభావం చూపించలేదు. కాకపోతే అంతకు ముందు వచ్చిన ‘కంగువా’ కూడా ఫ్లాపే. పైగా సూర్య కెరీర్లో రూ.50 కోట్లు అందుకోవడం ఇదే తొలిసారి. మరి.. నాగవంశీ ఏ లెక్కతో సూర్య కు రూ.50 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారో మరి. ఇప్పటికే వెంకీ అట్లూరి కథ రెడీ చేసేశారు. జూన్, జూలైలలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మారుతి కారు నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటికే టైటిల్ కూడా లాక్ చేసినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏమిటన్నది త్వరలో ప్రకటిస్తారు.