తమిళ నటుడు సూర్య ప్రయోగాలకు పెట్టింది పేరు. కొత్త కొత్త జోనర్లు, కథలు ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. తను మాస్ సినిమాలు చేసిన ప్రతీసారీ… మంచి ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు చేసిన ‘కురుప్పు’ కూడా మాస్ మీల్సే అనిపిస్తోంది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. ఆర్.జే.బీ దర్శకత్వం వహించారు. సూర్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ఈరోజు విడుదల చేశారు.
”కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు…
మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రడై వచ్చే దేవుడు..”
అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
టీజర్ అంతా యాక్షన్ ఫీస్ట్ లా నడిచింది. ఎప్పటిలానే సూర్య రెండు మూడు గెటప్పుల్లో దర్శనమిచ్చాడు. టీజర్లో కొన్ని ఐకానిక్ మూమెంట్స్ గుర్తొచ్చాయి. ‘నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరుంది’ డైలాగ్ బాషాలో రజనీకాంత్ స్టైల్ గుర్తు చేసింది. మరో షాట్ `గజిని`ని రిప్లికా చేసింది. ‘కురుప్పు’ కథేమిటో టీజర్లో బయటపెట్టకపోయినా, యాక్షన్ కి లోటు లేని సినిమా అనేది అర్థం అవుతోంది. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్లకు బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. సూర్య కు ఈమధ్య వరుసగా ఫ్లాపులే తగిలాయి. ఓ మాస్ హిట్ తనకు అత్యవసరం. ఈ సినిమా అది ఇచ్చేలానే కనిపిస్తోంది.