సింగం సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య విజృంభించి నటించాడు. ఆయా చిత్రాలు మాస్‌కి బాగా ఎక్కేశాయి. ఇప్పుడు సింగం 3 రెడీ అవుతోంది. సూర్య మరోసారి తన పోలీస్ పౌరిషాన్ని చూపించబోతున్నాడు. అనుష్క, శ్రుతిహాసన్‌లు ఉండడంతో గ్లామర్ కి కొదవ లేదు. ప్రచార చిత్రమే హై ఓల్టేజ్ తో హీట్ ఎక్కిస్తోంది. మరి సినిమా ఇంకెంత వాడీ వేడీగా ఉంటుందో అని సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి మంచి రైట్సే దక్కాయి. భారీ మొత్తం చెల్లించి తెలుగు రైట్స్ కొనుక్కొన్నారు. అందుకే సింగం టీమ్ విడుదల తేదీ విషయంలో ఆచి తూచి స్పందిస్తోంది. ఈనెల 16న సింగం 3ని విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ధృవ ఓ వారం ముందే రావడం వల్ల… విడుదల తేదీ వాయిదా పడింది. ఈనెల 23న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ డేటూ అనుమానమే.
అవును… సింగం 3 కోసం అభిమానులు ఇంకొన్ని రోజులు నిరీక్షించాల్సిందే. డిసెంబరు 23న రావాల్సిన ఈ సూర్య సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడబోతోంది. ప్రస్తుతం చెన్నైని వర్థ తుఫాను అట్టుడికిస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం స్థంభించింది. ఇలాంటి దశలో జనాలు థియేటర్‌కి రావాలనుకోడం అత్యాసే. దానికి తోడు పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినిమా పరిశ్రమపై ఇంకా కనిపిస్తోంది. ఈ దశలో సింగం 3ని విడుదల చేయడం సాహసమే అవుతుందని చిత్రబృందం భావిస్తోందట. అందుకే ఇప్పుడు సింగం 3 వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త విడుదల తేదీ విషయంలో దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నార్ట. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తారు.