సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’. మమిత బైజు కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోజు టీజర్ విడుదలైంది. విశ్వనాథ్ పాత్రలో సూర్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. తన వయసుకి తగిన పాత్ర అది. తనకంటే వయసులో చాలా చిన్నదైన కథానాయిక ప్రేమలో పడుతుంది. వాళ్లిద్దరి మధ్య వయసు ఎలాంటి గొడవ తీసుకొచ్చిందన్నదే కథ. మమిత క్యారెక్టరైజేషన్ చాలా స్వీట్ గా అనిపిస్తోంది.
ప్రేమకు కులం, మతం, డబ్బు మాత్రమే కాదు.. `వయసు` కూడా అంతరమే. ఈ పాయింట్ ని చాలా క్యూట్‌గా, వినోదభరితంగా చూపించబోతున్నారు ఈ సినిమాలో. టీజర్ లో డైలాగులు చాలా క్యాజువల్ గా, సహజంగా అనిపించాయి.
సూర్య: నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలామంది ఇలా వచ్చి పడిపోతారు..
మమిత బైజు: కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా. నువ్వు పడు.. చాలు..
ఈ డైలాగ్ చాలు. సినిమా కథేమిటో చెప్పేస్తోంది. సినిమా లుక్ కూడా క్లాసీగా, రిచ్‌గా అనిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఈ వయసు పోరు ఎలాంటి మలుపులకు కారణమైందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాలి. సూర్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొన్నారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొంది. టీజర్ చూస్తుంటే వెంకీ అట్లూరి ఖాతాలో మరో హిట్ పడినట్టే అనిపిస్తోంది.
