కేటీఆర్ మీద బండి సంజయ్ చేసే ఆరోపణలు చాలా ఘాటుగా ఉంటాయి. కేటీఆర్ ప్రస్తావన వస్తేనే విరుచుకుపడతారు. తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అంటారు. అసలు కేటీఆర్ కు తన స్థాయి లేదని తేల్చేస్తారు. అదే కేటీఆర్ కూడా.. బండి సంజయ్ ను బండి.. గుండు అంటూ ఎగతాళి చేస్తారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా ఏమీ తెలియదంటారు. వీరిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం అలాంటిది. కానీ వీరిద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటుంది?
రాజకీయాలు గతంలోలా లేవు. తీవ్రంగా విరుచుకుపడే నేతలు ఎదురెరుగా వస్తే.. చూసీచూడనట్లుగా వెళ్లిపోయే రాజకీయాలు వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులు చూసే సంప్రదాయం వైసీపీ, బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమయిందని చెప్పుకుంటారు. అయితే అది బీఆర్ఎస్, వైసీపీ నేతలు చేస్తారేమో కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం.. తమదైన రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో వరదల కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. హెలికాఫ్టర్లు తెప్పించి మరీ బండి సంజయ్.. సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అక్కడికి కేటీఆర్ కూడా పరిశీలనకు వచ్చారు.
ఇలా ఇద్దరు ఎదురు పడ్డారు. అప్పుడు కార్యకర్తలు ఉత్కంఠకు గురయ్యారు కానీ.. అక్కడ ఎలాంటి మాటల తూటాలు పేలలేదు. పైగా ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. తరవాత ఎవరి దారిన వాళ్లు పోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా ఎలా తిట్టుకున్నా.. వ్యక్తిగతంగా ఇలా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.