అతి సర్వత్రా వర్జయిత్ అంటారు. అతిగా ఆలోచిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రస్తుతం సుశాంత్ పరిస్థితి అలానే ఉందట. కాళిదాసు, కరెంట్, అడ్డా.. ఇలా ముచ్చటగా మూడు ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు బాబు గారికి. ఈ సారి కూడా హిట్టు కొట్టకపోతే అంతే సంగతులు. అందుకే అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నాడు. కామెడీ సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి.. అలాంటి కథని ఎంచుకొన్నాడు. కమెడీ సినిమాని మినిమం బడ్జెట్లో తీసిపెట్టేసే జి.నాగేశ్వరెడ్డిని ఎంచుకొన్నాడు. సినిమాకి కొత్త కలరింగ్ ఇద్దామని… నాగచైతన్య, అఖిల్‌లను తీసుకొచ్చాడు. సినిమా లెంగ్త్ మరీ ఎక్కువుంటే ప్రమాదమని 2 గంటలకు కుదించాడు. అంతా బాగానే ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. లాస్ట్ మినిట్ ఛేంజులు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
ఈ సినిమాని బెటర్ అవుట్ పుట్ కోసం కొంతమందికి చూపించుకొంటున్నాడు సుశాంత్. సినిమా చూసి ఒకొక్కరూ ఒక్కో మార్పు చెబుతూ వెళ్తున్నారట. ఈ సీన్ బాలేదు, అది లెంగ్త్ ఎక్కువైంది అని చెబుతుంటే.. ట్రిమ్ చేసుకొంటూ వెళ్తున్నాడట. ఎడిటింగ్ రూమ్‌లో కంటే.. ఇప్పుడు ఈ కత్తిరింపుల పని ఎక్కువైపోయిందన్న జోకులు కూడా వినిపిస్తున్నాయి. పాపం.. సుశాంత్ బాగా కష్టపడుతున్నాడు. ఈ కష్టమేదో స్క్రిప్టు దశలో ఉన్నప్పుడే పడితే.. ఆఖరి నిమిషంలో ఈ టెన్షన్ తప్పేది. ఇంతకీ ఈ సినిమాని ఇప్పటి వరకూ నాగ్‌కి చూపించలేదట. ఆయన చూస్తే ఇంకెన్ని మార్పులు చెబుతాడో మరి..!