ఆడుదాం.. ఆంధ్రాపై విజిలెన్స్ రిపోర్టు వచ్చేసిందని ఇక ఆట ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు బయటకు లీక్ ఇచ్చి రెండు, మూడు వారాలు దాటిపోతోంది. కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు. విజిలెన్స్ రిపోర్టు డీజీపీకి పంపిస్తారని.. దాన్ని ఆయన ప్రభుత్వానికి పంపి తదుపరి చర్యలపై డైరక్షన్స్ పొందుతారని చెప్పుకున్నారు. కానీ ఆ విజిలెన్స్ రిపోర్టు ఎక్కడి వరకూ వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ముందడుగు పడటం లేదు.
ఆడుదాం ఆంధ్రా పేరుతో అన్ని జిల్లాలలో రూ. 110 కోట్లుపైగా ఖర్చుపెట్టారు. అందులో జరిగిన వింతలు, విశేషాల గురించి చెప్పాల్సిన పని లేదు. రోజా డాన్సులు వేయడానికే ఆ ప్రోగ్రాం పెట్టినట్లుగా సాగిపోయింది. ఎక్కడికి వెళ్లినా నృత్యాలు కామన్. అదే సమయంలో.. ఆ ఆటల్లో పాల్గొన్నది కూడా వైసీపీ కార్యకర్తలే. క్రీడాభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను నాసిరకం క్రీడా సామాగ్రి కొని.. వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించి డబ్బులన్నీ కాజేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి.
ప్రభుత్వం మారిన తర్వాత అవకతవకలను గుర్తించడంతో… శాప్ చైర్మన్ రవి నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసింది. జిల్లాల వారీగా పూర్తిగా విచారణ జరిపింది. ఎక్కడెక్కడ ఎంత నొక్కేశారు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయి. .. అన్నది కూడా తేల్చారు. మొత్తం రిపోర్టులో ఉంది. చర్యలు తీసుకోవాల్సింది మాత్రమే మిగిలి ఉంది. అయినా ముందుకు సాగడం లేదు. సరైన సమయం కోసం చూస్తున్నారేమో కానీ.. ఎప్పుడో ఓ సారి ఆట మొదలవడం ఖాయమని చెబుతున్నారు. అది ఎప్పుడన్నది తేలాల్సి ఉంది.