సెప్టెంబరు 25న వస్తోంది ‘ఓజీ’. ఇప్పటికే ఓ గ్లింప్స్ బయటకు వచ్చింది. ఓ పాట కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా `ఓజీ` నుంచి రెండో పాటగా ‘సువ్వీ.. సువ్వీ’ విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఆల్బమ్ ఇది. కల్యాణ చక్రవర్తి రాశారు. శృతి రంజని ఆలపించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
”ఉండిపోవా ఉండిపో ఇలాగా
తోడుగా నా మూడు ముళ్లలాగా
నిండిపోవా నీడలాగ నీలాగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగ…”
– అంటూ హాయిగా పిల్ల తెమ్మెరలా మొదలైన పాట… ఆద్యంతం హాయిగా సాగింది. ట్యూన్ పరంగా, టోన్ పరంగా.. మృదవైన గీతం ఇది. ఆర్కెస్ట్రైజేషన్ బాగా కుదిరింది. వినగానే ఎక్కేయదు కానీ… వినగా వినగా స్లో పాయిజన్ లా మనసుని హత్తుకొంటుంది. పల్లవికీ, చరణానికీ మధ్య వచ్చే ఒక వయెలిన్ బిట్ మాత్రం హాంట్ చేస్తుంది.
”విడివిడిగానే అడుగులు ఉన్నా
విడిపడలేని నడకలులాగ” – లాంటి చోట కల్యాణ చక్రవర్తి కలం బాగా కదిలింది.
పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ జంట, వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆకట్టుకొంటుంది. పవన్ లుక్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే టీజర్ బయటకు వచ్చే అవకాశం ఉంది.