ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పండుగలకు… భారత్ తయారీ వస్తువులనే కొనాలని భారతీయులకు పిలుపునిచ్చారు. దాని వల్ల భారత్ తయారీ దారులకు మేలు జరుగుతుందన్నారు. మారుతున్న ప్రపంచ ప్రాధాన్యతల్లో భారత వస్తువుల ప్రాముఖ్యత పెచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ పిలుపునకు స్పందించించి.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఆఫీసు వ్యవహారాలను చూసే సాఫ్ట్ వేర్లను జోహోతో రీప్లేస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అందరూ ఆహా..ఓహో అన్నారు. కానీ స్వదేశీ నినాదం ఇలా ఎప్పటికీ విజయవంతం కాదు. విజయవంతం కావాలంటే..భారత ఉత్పత్తుల్లో నాణ్యత పెరగాలి. విదేశీ ఉత్పత్తుల కంటే మెరుగైనవిగా మార్చుకోవాలి. దానికి తగ్గ ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి రావాలి.
స్వదేశీ నినాదం ఇప్పటిది కాదు !
దేశ ప్రజలకు స్వదేశీ నినాదం ఇవ్వడం కొత్త కాదు. దశాబ్దాల నుంచి ఇలాంటి నినాదాలు వస్తనే ఉన్నాయి. ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న సమయంలో .. దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు సహజంగా మారిపోయాయి. స్వేచ్ఛా వాణిజ్య విపణి అందుబాటులోకి వచ్చాక.. దేశీయ ఉత్పత్తి దారుల్ని కాపాడటానికి స్వదేశీ నినాదమే మంచిదని చెప్పడం ప్రారంభించారు. వీలైనంత వరకూ మేడిన్ ఇండియా వస్తువుల్నే భారతీయులు కొనేందుకు ప్రయత్నిస్తారు. కానీ వాటికి ప్రయత్నంగా ఉండే విదేశీ ఉత్పత్తులు తక్కువ ధర, మంచి క్వాలిటీగా ఉంటే.. ఇవాళ కాకపోతే రేపైనా వాటి వైపు ఆకర్షితులవుతారు.
ట్విట్టర్ స్వదేశీ ప్రయత్నం “ కూ” ఎందుకు మూతపడింది ?
మైక్రోసాఫ్ట్, గూగుల్ అందించే కొన్ని సాఫ్ట్ వేర్ల సేవలను నిలిపివేసి.. జోహో కార్పొరేషన్ అందిస్తున్న సేవలను తాను తీసుకుంటున్నానని రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ ప్రకటించారు. ఆయన ఈ నినాదంలోకి జోహోను తీసుకు రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే జోహో కార్పొరేషన్ ఇపుడు మల్టినేషనల్. ఇండియా నుంచి ప్రారంభమై అనేక దేశాలకు విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో మా దేశంలో..మా సాఫ్ట్ వేర్ అన్నట్లుగా చేయడం వల్ల సమస్యలు ఆ కంపెనీకి వస్తాయి. గతంలో బీజేపీ నేతలు ట్విట్టర్ కు పోటీగా కూ అనే మైక్రో బ్లాగింగ్ సైట్ కు ప్రోత్సాహం ఇచ్చారు. స్వయంగా ప్రధాని కూడా అకౌంట్ ఓపెన్ చేశారు. చాలా మంది ప్రోత్సహించారు.కానీ అది మూతపడింది. ఎందుకు ఇలా జరిగిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
వస్తువులు అయినా.. సేవలు అయినా .. మంచి క్వాలిటీ, తక్కువ ధర ముఖ్యం !
భారత్ లో మంచి క్వాలిటీ, తక్కువ ధరతో వస్తువులు అందుబాటులో ఉంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల్ని భారతీయులు ఎందుకు కొనుగోలు చేస్తారు. చైనా వస్తువుల్ని అందరూ డూప్లికేట్ అని ఎగతాళి చేస్తారు.?. వాటినే ఎందుకు కొనుగోలు చేస్తున్నారు. దీపావళి వస్తే.. లైట్లు మొత్తం చైనా నుంచే వస్తాయి. ఎందుకు ?. ముందుగా భారతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. వారు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుని తక్కువగా వస్తువులు తయారు చేసేలా చూడాలి. స్వావలంబన సాధించేలా చేయాలి. అప్పుడు స్వదేశీ నినాదం ఇవ్వక్కర్లేదు. స్వదేశీనే మార్కెట్‌ను శాసిస్తుంది.