కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతున్న జీఎస్టీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ, మండలి ఆమోదం తెలిపాయి. మోడీ ప్రభుత్వం కోరిన మేరకు ఓ లాంఛనం పూర్తయింది. మరి ప్రజలకు ఏం లాభం కలుగుతుందంటే పెద్దగా లేదేమో అనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పన్ను వాయింపు షరా మామూలే. కాబట్టి వాహనదారులకు ఊరట కలిగే అవకాశం లేనే లేదు. పెట్రో పన్ను జోలికి రామని కేంద్రం హామీ ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుకు సమ్మతి తెలిపాయి. అదీ అసలు సంగతి.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రాల వంతు. కేవలం దీనికోసమే తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం సమావేశమైంది. బిల్లును ఆమోదించింది. మండలి కూడా ఆమోదం తెలిపింది.
ఒకే దేశం, ఒకే పన్ను విధానం కోసం ఈ బిల్లును తెచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరైన పెట్రో ఉత్పత్తులపై అప్పుడే పన్ను ఎత్తివేయరు. కాబట్టి ప్రజలకు పెట్రో భారం తప్పదు. తర్వాతి కాలంలో ఈ భారం తగ్గుతుందేమో అని ఎదురు చూడాలి. అయితే ఇంకా ఇతర చాలా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. మరికొన్నింటి ధరలు పెరుగుతాయి.
దేశంలో పెట్రో ఉత్పత్తులపై అత్యధికంగా అమ్మకం పన్ను, వ్యాట్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. సంపన్న రాష్ట్రమైనా, ప్రజలపై పెట్రో పన్ను భారాన్ని కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగానే మోపింది. ఇటీవలే మరింత భారం పెంచింది. జీఎస్టీ బిల్లు జాక్ పాట్ గా భావించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. సేవాపన్ను రూపంలో ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఐటీ, బీపీవో, ఇతర సేవా రంగాలు భారీగా విస్తురిస్తున్నాయి. చివరకు వాణిజ్య పన్నుల కంటే సేవా పన్నే ఎక్కువగా వసూలైనా ఆశ్చర్యం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఏదైనా రంగానికి సంబంధించి ఆదాయం నష్టపోతే దాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది. కాబట్టి ఐదేళ్ల వరకూ ఆ టెన్షన్ కూడా లేదు. ప్రభుత్వం పరంగా ఆల్ హ్యాపీస్. కానీ పెట్రోల్ ధరలు తగ్గుతాయని భావించిన ప్రజల్లో చాలా మందికి ఇంకా ఈ విషయం తెలిసినట్టు లేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చినా మన బండి పెట్రోలో, డీజిల్ ఖర్చు పైసా తగ్గదండీ!