ఎడిటర్స్ కామెంట్ : పాలకులకు అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?

రాజకీయ నేతలకు నీతి ఉంటే ఆంధ్రలో ఇంత సంత ఉండకపోవచ్చును..! ఒకప్పుడు ఏ రాజకీయాలు ఆంధ్రలో నడవవు అనుకున్నారో.. వాటిని విజయవంతంగా నడిపించేస్తున్నారు రాజకీయ నేతలు. వివాదాలు సృష్టించాల్సిన అవసరమే లేని చోట.. కిరోసిన్ పోసి నిప్పు పెట్టి.. దాని మీద.. సెగ కాసుకునేందుకు బాధ్యతగా వ్యవహరించాల్సిన వాళ్లూ వెనుకాడటం లేదు. ఫలితంగా ఆంధ్రలో ఇప్పుడేమి జరుగుతుందో అంచనా వేయడం కష్టం కాదు. కొన్నాళ్ల కిందటి వరకూ.. ఏపీకి ఆ పరిశ్రమ వచ్చేది.. ఈ పరిశ్రమ వచ్చేది .. ఆ ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్ అనే ప్రచారమే ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు ఆ గుడిపై దాడి.. ఈ ఆలయంపై దాడి.. అంటూ.. ఎజెండా పూర్తిగా మారిపోయింది. మధ్య మధ్యలో కక్ష సాధింపుల కేసుల ఉండనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఆంధ్రకు మేలు చేస్తుందా..?

ఏపీ హిందువుల్లో కృత్రిమ ఆవేశం రగిల్చే ప్రయత్నాలు..!

కుల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కుళ్లిపోయింది. ఇప్పుడు వారి మనసుల్లో మతం చొప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నాటి అయోధ్య రామయ్య ఆలయం ఫార్ములానే ఇప్పుడు ఏపీలో అమలవుతోందని… కాస్త ఓపెన్‌గా మాట్లాడుకుంటే.. క్లియర్‌గాే చెప్పుకోవచ్చు. అంతర్వేది రథాల దగ్గర్నుంచి ప్రారంభమైన రాజకీయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తిరుమలలో గోవింద నామం తప్ప మరో మాట వినిపించకూడదనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ.. మంత్రి కొడాలి నానిని కొండపైకి పిలిపించి మరీ.. దేశ ప్రధానిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించడంతోనే.. అసలు రాజకీయం కళ్ల ముందు ఉండిపోతోంది. ఓ పథకం ప్రకారం.. జరుగుతున్న వ్యూహం హిందువుల్లో కృత్రికమ ఆవేశం రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తోంది.

పుండు మీద కారం చల్లినట్లుగా ప్రభుత్వం తీరు..!

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన జరిగినప్పుడు హిందూ సంఘాలు, భక్తుల ఆగ్రహం ఓ దశలో అదుపుతప్పేలా కనిపించింది. మంత్రుల్ని నిలదీశారు. కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసినంత పని చేశారు. చర్చిపై రాళ్లేశారు. ఇంత కాలం సహనంగా ఉన్న వారు ఒక్క సారిగా ఎలా ఎందుకు ఉద్రేకపడుతున్నారంటే.. ఒక్కటే కారణం అని అనుకోవచ్చు. వరుసగా ఆలయాలను టార్గెట్ చేయడమే కాదు.. అలా జరగడాన్ని చాలా చాలా తేలికగా ప్రభుత్వం తీసుకుటూ వచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి పదిహేను నెలల కొత్త ప్రభుత్వం పాలనలో నెలకు రెండు , మూడు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో.. హిందువుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు.. వ్యతిరేకంగా ఉండటం… ఇతర మతాలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం.. ప్రజల్లో అనేక అనుమానాలకు కారణం అయింది. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. ఆయన జగన్‌కు సొంత బాబాయి. ఆయన మతం ఏమిటన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత వరుసగా తిరుమలకు వచ్చే భక్తులపై చార్జీలను బాదడం ప్రారంభించారు. మొదట రూమ్ చార్జీలను పెంచారు. టోల్ చార్జీలు పెంచారు. తర్వాత లడ్డూ ధరలను పెంచారు. ఇప్పుడు మరోసారి ఏసీ రూమ్‌ల చార్జీలను పెంచారు. ఇలా ప్రతీ దాన్ని భారం చేసే ప్రయత్నం చేశారు. సామాన్య భక్తులను .. దేవుడి నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో.. టీటీడీలో అన్యమతస్తులైన వారు ఉద్యోగాలు చేస్తున్న వైనం సంచలనం సృష్టించింది. అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు చేయించారు. కానీ ఆయనను మధ్యలోనే సాగనంపేశారు. ఆ తర్వాత టీటీడీలో అన్యమతస్తులైన ఉద్యోగుల గురించి అడిగేవారు లేరు. ఇక శ్రీశైలంలోనూ ఇలాంటి పరిస్థితే. ఇక విజయవాడలో వెండి రథం సింహాలు మాయంపై… జరిగిన చర్చలో బయటకు వచ్చిన పేరు అప్రైజర్ షమీ. అంటే అమ్మవారి ఆభరణాలు లెక్కించేది కూడా హిందువు కాదు.

ప్రభుత్వం నుంచి ఆలయాలను..మాన్యాలను కాపాడుకోవాల్సిన దుస్థితి..!

హిందూ ఆలయాలకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు. ఆలయాలు భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాల మీదే నడుస్తాయి. దాతలు ఇచ్చిన మాన్యాలు అత్యధిక ఆలయాలకు రాబడి ఇస్తూంటాయి. అయితే.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆలయాల మాన్యాలకు రక్షణ లేకుండా పోయింది. ఏకంగా టీటీడీ భూములనే అమ్మకానికి పెట్టారు. వివాదాస్పదమయ్యే సరికి వెనక్కి తగ్గారు. చాలా చోట్ల దేవాదాయ భూములను సేకరించారు. కొన్ని చోట్ల కోర్టులు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్న సింహాచలం అప్పన్న భూముల వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. ఆ ఆలయం కూడా హిందూవేతర శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఆలయం ప్రైవేటు వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఏ ఆస్తులు.. ఎవరి పరం అవుతాయో అర్థం కావడం లేదని.. భక్తులు ఆందోళన చెందే పరిస్థితి. అదే సమయంలో హిందువుల సెంటిమెంట్లు దెబ్బతీసే కొన్ని నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేసింది. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలచేత క్రైస్తవ మతానికి చెందిన పాటలు పాడించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పాస్టర్లకి, ముల్లాలకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇవన్నీ ఆలోచనాపరుల్లో అనుమానాలకు తావిచ్చేలా మారాయి.

డిక్లరేషన్ అంశాన్ని పెంచి పెద్ద చేసింది ఎవరు..?

మామూలుగా అయితే..ఇలాంటి ఘటనలు జరిగితే.. కుట్రదారుల్ని కనిపెట్టి… ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ జరిగిన ఘటనల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోంది. తిరుమల డిక్లరేషన్ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీనే రాజకీయ అజెండా ప్రకారం.. పెంచి పెద్ద చేసిందని జరిగిన పరిణామాల్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. అసలు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు. ఇక సీఎం అయిన తర్వాత పెట్టడం అనే డిమాండే వినిపించకూడదు. గత ఏడాది పెట్టలేదు కూడా. అయినా మొదట.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసలు డిక్లరేషన్ ను ఎత్తేస్తామని ప్రకటించడంతో వివాదం రేగింది. ఇక ఆలయ బోర్డుల్లోనూ.. హిందూవేతలకు చాన్సివ్వడానికే ఈ కుట్ర అంతా అన్న ప్రచారం జరిగింది. చివరికి జగన్ కు మాత్రమే అక్కర్లేదని చెప్పానని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చి మరింత రగడ కు కారణం అయ్యారు. ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని.. వైసీపీలో పెద్ద నోరున్న కొడాలి నాని, రోజాలతో అనిపించిన వ్యాఖ్యలు .. మరింత వివాదానికి కారణం అయ్యాయి. ఓ వైపు ఏపీలో మత మార్పిడులు ఉద్ధృతంగా సాగుతున్నాయని.. జాతీయ స్థాయిలో కొన్ని అధ్యయన సంస్థలు నివేదికలు వెలువరిస్తున్నాయి. కొంత మంది రాష్ట్రపతి కూడా ఫిర్యాదులు చేశారు. ఇలాంటి సమయంలో హిందూత్వాన్ని.. ఆలయాలను కించ పరిచే విధంగా అదే పనిగా మాట్లాడి.. ఓ ఎజెండాను అధికార పార్టీ సెట్ చేస్తోంది.

రాజకీయ వ్యూహాల్లో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్థం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ వ్యూహాలతో అస్తవ్యస్థం అయిపోతోంది. ఒకప్పుడు రాజకీయం… ప్రజలకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ.. కీడు చేయకూడదు అన్న పద్దతిలో ఉండేది. కానీ ఇప్పుడు.. ఎవరికి కీడు జరిగినా సరే.. తమకు మాత్రం మేలు జరిగితే చాలన్నట్లుగా రాజకీయం మారిపోయింది. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే ఈ రాజకీయ వ్యూహాలు ఇప్పుడు.. ఆంధ్రలో విలయ తాండవం చేస్తున్నాయి. మొదట ప్రాంతాలతో చిచ్చు పెట్టారు. తర్వాత కులంతో ఆటాడుతున్నారు. ఇప్పుడు మతాల మధ్య రాజకీయ ఆట నడుస్తోంది. ఈ మాయలో ప్రజలు పడిపోయారో లేదో చెప్పడం కష్టం. ప్రస్తుతం ఏపీ ప్రజలకు అంత తీరిక లేదు. వారి జీవన ప్రమాణాలు పడిపోయాయి. కరోనా లాక్ డౌన్.. అంతకు మించి ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. వారు రోజువారీ పనుల కోసమే తంటాలు పడుతున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు. వారికి ఉపాధి లేదు. ఇలాంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నాయి. వీటన్నింటినీ పైకి రానివ్వకుండా కొత్త రాజకీయం ఏపీని చుట్టు ముట్టేసింది.

పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత కుటుంబానికి ఆ జంట ప్రాధాన్యం ఇచ్చి.. ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటేనే ఆ బంధం నిలబడుతుంది. లేకపోతే.. కుప్పకూలిపోతుంది. రాజకీయాల్లోనూ అంతే. ప్రతిపక్ష పార్టీగా ఎలా ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అధికార పార్టీగా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల కోసమే ఆలోచించాలి. వారికి ఏదో చిల్లర సాయం చేస్తున్నాం కదా.. అని మిగతా అంతా తమ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవాలని అనుకోవడం .. అవివేకం. అనైతిక రాజకీయం. అదే సమయంలో విశ్వాసాల్ని దెబ్బకొట్టి రాజకీయం చేయాలనుకోవడం మూర్ఖత్వం. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. అందుకే.. పాలకులకు అంత నీతే ఉంటే.. ఇంత సంత ఎందుకు అని చెప్పుకునేది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా - సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా...

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

HOT NEWS

[X] Close
[X] Close