ఐటెమ్ గీతమంటే కాస్త మసాలా టచ్ ఉండాల్సిందే. అర్థాంగ ప్రదర్శనలు, అందాల్ని వర్ణిస్తూ కొన్ని సెక్సీ పదాలు మిక్స్ చేయాల్సిందే. కాకపోతే.. ‘ఇలాంటివి నా పాటల్లో వద్దు’ అంటూ వపన్ కల్యాణ్ గట్టిగా చెప్పడంతో ‘హరి హర వీరమల్లు’లోని ఐటెమ్ గీతాన్ని కాస్త పద్ధతిగా డిజైన్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణినే స్వయంగా చెప్పారు. చెప్పడమే కాదు… ‘తారా తారా’ పాటలో దాన్ని ఆచరించి చూపించారు కూడా. ‘హరి హర వీరమల్లు’ నుంచి నాలుగో పాట ‘తారా తారా’ విడుదలైంది. ఐటెమ్ పాటే అయినా మెలోడీ టచ్ ఉన్న గీతం ఇది. కీరవాణి మార్క్ స్పష్టంగా కనిపించింది.
”పోతుంటే నువ్ అలా అలా
బజార్ మొత్తం గోలే గోల
కోపంగా చూడొద్దలా
పేలబోయే ఫిరంగిలా” అనే సాకీతో పాట మొదలైంది.
”తార తార నా కళ్లు
వెన్నెల పూత నా ఒళ్లు
ఆకాశాన్ని ఎంతకని వెలకడతారు” అంటూ కొనసాగింది.
”చెమట చుక్క పడితే వజ్రమనుకొంటారు
వద్దకు వచ్చి నిలబడితే తడబడతారు
పెదవి కోసం పదవులు
నాభి కోసం నాలుగు ఊళ్లు అర్పిస్తామంటున్నారు ఈ నవాబులు” ఇలా సరదాగా సాగిపోయింది.
లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ కలసి ఈ పాటని ఆలపించారు. శ్రీహర్ష ఇమానీ రాశారు. నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వెన్నెల కిషోర్ తో పాటు కామెడీ గ్యాంగ్ ఈ పాటలో కనిపించింది. చివర్లో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ షాట్ ఉన్నది కొన్ని సెకన్లే అయినా.. పవన్ కల్యాణ్ మానియా అంటే ఏమిటో తెలిసొచ్చింది. థియేటర్లో ఈ పాట ఇంకాస్త కిక్ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.