ఫాం ప్లాట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇవి ఇళ్లు కట్టుకోవడానికి పనికి రావు. అలాగే వ్యవసాయం చేయగిలిగేంత పెద్దవి కావు. కానీ ఎంతో కొంత భూమి ఉండాలన్న సగటు మధ్యతరగతి ఆశల్ని వాడుకుంటూ..రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఫాం ప్లాట్లను అమ్మేస్తున్నారు.
వీటిని కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఫాం ప్లాట్ టైటిల్ డీడ్ (పట్టా) స్పష్టంగా ఉందా లేదా అని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా ధరణి పోర్టల్ ద్వారా వెరిఫై చేయవచ్చు. గత 12-15 సంవత్సరాల ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆస్తిపై రుణాలు, లీగల్ డిస్ప్యూట్లు లేదా ఇతర ఆటంకాలు లేవని నిర్ధారించుకోవాలి.
హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన ఆస్తి రక్షణ అథారిటీ (HYDRAA) నీటి వనరులు లేదా పబ్లిక్ పార్కులపై ఆక్రమణలను తొలగిస్తోంది. ఫాం ప్లాట్ ఇటువంటి ఆక్రమణ జోన్లో లేదని నిర్ధారించుకోవాలి. ఫాం ప్లాట్ లేఅవుట్ HMDA లేదా DTCP ఆమోదం ఉంటేనే పొందిందని నిర్ధారించుకోవాలి. అనధికార లేఅవుట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
ఫాం ప్లాట్ ఉన్న ప్రాంతానికి సరైన రోడ్ యాక్సెస్, విద్యుత్, నీటి సౌకర్యాలు ఉన్నాయా అని చూడండి. రియల్టర్ ట్రాక్ రికార్డును కూడా చూసుకోవాలి. గత ప్రాజెక్టులు, కస్టమర్ రివ్యూలు, లీగల్ కేసులు ఏవైనా ఉన్నాయా అని పరిశీలించాలి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఇతర ఒప్పందాలను న్యాయవాది ద్వారా పరిశీలన చేయించాలి. ఫాం ప్లాట్‌ను వ్యక్తిగతంగా సందర్శించి, భూమి స్థితిగతులు, సరిహద్దులు, సమీప ప్రాంతాలను పరిశీలించండి. GPS లేదా సర్వే టూల్స్ ఉపయోగించి బౌండరీలను ధృవీకరించుకున్న తర్వాత ముందడుగు వేస్తే మంచిది.