సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని విడదీసి ఇతర కార్పొరేషన్లలో కలపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి “సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం” అని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని పునర్వ్యవస్థీకరిస్తూ కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిత మల్కాజ్గిరి కార్పొరేషన్లో విలీనం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ కూడా చర్చల్లో ఉంది. ఈ మార్పుల వల్ల సికింద్రాబాద్ తన చారిత్రక ప్రాధాన్యతను, భౌగోళిక గుర్తింపును కోల్పోతుందని తలసాని ఉద్యమం ప్రారంభించారు.
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కలిపి ఒకే జిల్లాగా లేదా ఒకే ప్రత్యేక కార్పొరేషన్‌గా ఉంచాలని తలసాని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే స్థానిక వ్యాపార, కుల సంఘాలతో సమావేశమైన ఆయన, లష్కర్ అస్తిత్వంపై దెబ్బకొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ముక్కలు చేస్తాం అనే వ్యాఖ్యలు చేశారు.
