బుద్ది చిన్నది అయితే అన్నీ వివాదాలుగానే ఉంటాయి. కర్ణాటకలో జరుగుతున్న మైసూర్ శాండల్ సబ్బు ప్రచారకర్త నియామకం విషయంలో అదే జరుగుతోంది. మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా తమన్నా భాటియాను నియమించుకుంది. రెండేళ్లకు ఆరు కోట్ల రూపాయుల చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.
అయితే మన సబ్బుకు తమన్నా ఎందుకని కన్నడ నటీమణులు లేరా అని అక్కడి కన్నడ ఉద్యమ సంఘాలు తమ పని ప్రారంభించాయి. మైసూర్ సబ్బును మైసూర్ లోనో.. కర్ణాటకలోనే అమ్మడం లేదని.. దేశవ్యాప్తంగా అమ్ముతున్నామని.. దేశవ్యాప్త మార్కెట్ కోసం అందర్నీ పరిశీలించిన తర్వాతనే తమన్నాను ఎంపిక చేసుకున్నామని ఆ సంస్థ చెబుతోంది. దీపికా పదుకొనే, రష్మికను కూడా పరిశీలించామని..కానీ అన్ని అంశాలను చూసిన తరవాత తమన్నానే ఎంపిక చేసుకున్నామన్నారు. మన్నాకు నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోయర్లు ఉన్నారు.
కేఎస్డీఎల్ అనేది ప్రభుత్వ సంస్థ. అందుకే ఇది మరింత వివాదాస్పదం చేస్తున్నారు. మరో మూడేళ్లలో మైసూర్ శాండల్ సోప్ మార్కెట్ ను ఐదు వేల కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని .. అది నార్త్ లో మార్కెట్ పెంచుకుంటేనే సాధ్యమవుతుందని అనుకుంటున్నారు. కానీ అక్కడ కన్నడ సంఘాలు మాత్రం.. మా సబ్బు..మా నటి అని వితండవాదం చేస్తున్నారు. అయినా తమన్నా లాంటి మిల్కీ బ్యూటీ కంటే ఓ సోప్ కు సరైన ప్రచారకర్త ఎవరుంటారు?.