ముందు పద్ధతిగా ఉండి, ఆ తరవాత హద్దులు చెరిపేసుకొంటూ వెళ్లిన కథానాయిక తమన్నా. తెలుగు సినిమాల్లో గీత లోపలే ఉండి నటించేది. కానీ వెబ్ సిరీస్లు మొదలెట్టాక.. హాట్ హాట్ గా దర్శనమివ్వడం మొదలెట్టింది. ఎంతగా అంటే.. ఓ సిరీస్లో లిప్ లాక్, పడక గది సన్నివేశాల్లోనూ జోరుగా నటించేసేంత. వెబ్ సిరీస్ అంటే ఆ మాత్రం హాట్ గా ఉండాల్సిందే కాబట్టి, తమన్నా లోని ఈ మార్పుకు పెద్దగా ఎవరూ ఆశ్చర్యపడిపోలేదు. తమన్నా కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనిపించలేదు. ”వెబ్ సిరీస్ లంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా” అన్నట్టు కామెంట్లు విసిరేది. ఇప్పుడు ఈ బోల్డ్ నెస్ ఇంకొంచెం హద్దులు దాటబోతోంది. తమన్నా తాజాగా ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ సినిమాలో నటించడానికి ఒప్పుకొంది.
‘ఏ’ కంటెంట్ సినిమాలకు ట్రేడ్ మార్క్ లాంటి ఫ్రాంచైజీ ఇది. ‘రాగిణి ఎంఎంఎస్’ ఫ్రాంచైజీలో ఎలాంటి బోల్డ్ సీన్లు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఏక్తా కపూర్ ఐడియాలజీ, తన మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి తెలిసిన వాళ్లకు ఇలాంటి సినిమాల్లో ఏం ఉంటాయో విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 2లో అయితే సన్నిలియోన్ కథానాయికగా నటించింది. ఇప్పుడు ఆమె స్థానాన్ని తమన్నా భర్తీ చేయబోతోందన్నమాట. ఈసారి రాగిణి మరింత హాట్ గా, బోల్డ్ గా కనిపించబోతోందని ఏక్తా ముందే హింట్ ఇచ్చేసింది. కాబట్టి.. ఈసారి తమన్నా ఎలాంటి సన్నివేశాల్లో నటించబోతోందో అర్థం చేసుకోవొచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు తమన్నా ఎలా ఒప్పుకొంటోంది? తన ఇమేజ్ ఏమైపోవాలి? అనేవి తమన్నాని అభిమానించే వాళ్లు సంధిస్తున్న ప్రశ్నలు.
కాకపోతే తమన్నా మైండ్ సెట్ వేరు. కాలానికి అనుగుణంగా మారిపోతేనే.. ఇండస్ట్రీలో నిలబడగలం అనే సిద్ధాంతాన్ని తమన్నా గట్టిగా నమ్ముతోంది. ఈ జనరేషన్ కి సెక్స్కీ, శృంగారానికీ పెద్ద తేడా తెలియడం లేదు. అలాంటి కంటెంట్ అందించడానికి రూపకర్తలు రెడీగా ఉన్నారు. అలాంటి సినిమాలకే మార్కెట్ ఉంది. ఎవరెన్ని తిట్టుకొన్నా, విమర్శలు ఎక్కుబెట్టినా ‘రాగిణి ఎంఎంఎస్’ రెండు పార్ట్ లూ భారీ విజయాలు అందుకొన్నాయి. నిర్మాత రూపాయి పెడితే.. పది రూపాయలు గిట్టుబాటు అయ్యింది. అందుకే ఈ ఫ్రాంచైజీ ని కొనసాగించాలని ఏక్తా భావించింది. తమన్నాకు కూడా భారీ పారితోషికమే ముట్టజెప్పారని, అందుకే తమన్నా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి.