బాహుబలిద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నానంటున్న తమన్నా

హైదరాబాద్: తమన్నా బాహుబలిలో రాకుమారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రకు ప్రభాస్ ఎలా సరిపోయాడో, రాకుమారి పాత్రకు తమన్నాకూడా అంతే సరిపోయిందనేది అందరూఏకగ్రీవంగా అంగీకరిస్తున్న మాట. బాహుబలి చిత్రంపై, తన పాత్రపై, రాజమౌళిపై తన భావాలను తెలుగు360.కామ్‌తో తమన్నా పంచుకున్నారు.

బాహుబలి చిత్రంలో అవకాశంరాకపోయుంటే ఏదైనా కోల్పోయేదాన్నని అనిపించిందా?

ఈ పాత్ర చాలా ప్రత్యేకమైనది. నేను కెరీర్‌లో ఒక కీలకమైన స్థానంలో ఉండగా నాకు ఈ అవకాశం వచ్చింది. సాధారణంగా ఒక యాక్టర్ కమర్షియల్ చిత్రాలు చేసుకుంటూ వెళుతుంటే, అవితప్ప మరేమీ చేయలేరని ప్రేక్షకులు అనుకుంటారు. మామూలు పాత్రలకు భిన్నమైన ఇలాంటి పాత్ర చేయటం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక చారిత్రక చిత్రం. దీనిలోనివన్నీ భారీస్థాయి పాత్రలు. నేను పోషించే రాజకుమారి పాత్రలో ఎన్నో పార్శ్వాలు ఉంటాయి. పోస్టర్‌లో కనిపించేది ఒక పార్శ్వంమాత్రమే. చిత్రంలో ఎన్నో ఉంటాయి. సినిమా చూస్తేనే అవి తెలుస్తాయి. మరోవైపు బాహుబలిద్వారా మళ్ళీ బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాను. ఈ సారి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను.

రాజమౌళితో పనిచేయటం

రాజమౌళి ఏది చేసినా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఈ చిత్రంకోసం ప్రీ ప్రొడక్షన్‌ పనినే ఒకటిన్నర సంవత్సరం చేశారు. ఆ సమయంలో ఎన్నోమాక్ ట్రయల్స్, మాక్ షూట్స్ జరిపారు. మామూలుగా షూటింగ్‌లో లొకేషన్‌కు వెళ్ళిన తర్వాత రిహార్సల్స్ చేస్తారు. కానీ ఈ సినిమాకోసం రెండురోజులముందునుంచి ఆ సీన్‌ను మేము రిహార్సల్స్ చేశాము. దానివలన అసలు షూటింగ్ చేసేటపుడు మాకు సులువయ్యేది. సినిమా చేస్తున్నంతకాలం రాజమౌళి కూల్‌గా ఉంటూ తనకు కావలసింది రాబట్టుకునేవారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవటంవలన అప్పుడప్పుడు పరిస్థితి అదుపుతప్పే అవకాశాలుంటాయి. అయితే రాజమౌళి తొణకకుండా, బెణకకుండా ఉండటంవలన సినిమా బాగా వచ్చింది. ఆయన ఎనర్జీ యూనిట్‌లోని అందరికీకూడా వచ్చేసేది. దానికితోడు ఆయన పూర్తి స్పష్టతతో ఉండటంవలన మాకు చేయవలసిన పని తేలికైపోయేది. నటీనటులను ఆయన బాగా చూసుకుంటారు కాబట్టి మేము 200శాతం ఔట్‌పుట్‌ను ఇవ్వగలిగేవాళ్ళం.

షూటింగ్‌లో మీరు మరిచిపోలేని సందర్భం

ఒకసారి రాజమౌళి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా నన్ను ప్రత్యేకంగా ప్రశంశించారు. అది నేను మరిచిపోలేని సందర్భం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో బాహుబలి బెస్ట్. ఇంతకుముందు పయ్యా, 100%లవ్ చిత్రాలు నాకు బాగా ఇష్టమైనవిగా ఉండేవి. ప్రేక్షకులు నన్ను ఒక నటిగా గుర్తుంచుకోవటానికి కారణం ఆ రెండు చిత్రాలే. నా మూడోచిత్రంలో ఇలియానాతో కలిసి చేశాను. అది నెగెటివ్ రోల్ అయినప్పటికీ నాకు బాగా ఇష్టం. అలాంటి బలమైన పాత్రలను పోషించటం ఆసక్తికరంగా ఉంటుంది. బాహుబలిని అక్కడక్కడా చూశాను. అయితే గ్రాఫిక్స్‌ కలిపిన తర్వాత చూడాలని నేనుకూడా ఉవ్విళ్ళూరుతున్నాను. సాబు సిరిల్ పనితనం, గ్రాఫిక్స్ కలిసినప్పుడే అసలు మ్యాజిక్ జరిగేది.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com