తమిళ నాడు ముఖ్యమంత్రి, ఏ ఐ ఏ డి యం కె అధినేత్రి జయలలిత అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతిచెందటంతో అర్ధ శతాబ్దిపాటు తమిళ్ నాడు రాజకీయాలను శాశించిన ద్రావిడ రాజకీయాలలో పెను మార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఆమె రాజకీయ ప్రత్యర్థి, డీయంకే అధినేత కరుణానిధి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండటంతో 2019 లోక్ సభ ఎన్నికల నాటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులలో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
జయలలిత వంటి ప్రజాకర్షణ, ప్రజలను ఆకట్టుకొనే గల నాయకత్వం ఆ పార్టీలో లేకపోవడంతో పార్టీని సమైక్యంగా ఉంచడమే సమస్యగా మారే అవకాశం ఉంది. కరుణానిధి తన వారసుడిగా కుమారుడు ఎన్ కె స్టాలిన్ ను ప్రకటించడం, గత ఎన్నికలు మొత్తం స్టాలిన్ ఆధ్వర్యంలోనే పార్టీ పాల్గొనడంతో ఆ పార్టీలో నాయకత్వ సమస్య ఎదురయ్యే అవకాశం లేదు. అయితే స్టాలిన్ నాయకత్వం పట్ల కరుణానిధి కుటుంబంలోనే ఏకాభిప్రాయం లేదు.
ఆయన కుటుంభం సభ్యులతో పాటు, పార్టీలో పలు బలమైన వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో జయలలిత సన్నిహిత సహచరురాలు శశికళ నటరాజన్ తెరవెనుక నుండి చక్రం తిప్పే ప్రయత్నం కొంతకాలంగా చేస్తున్నారు. సుమారు 45 మంది పార్టీ యం ఎల్ ఏ లు ఆమెను ముఖ్యమంత్రిగా చేయాలని కోరినల్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితులలో పార్టీలో చీలిక అసలుకే మోసం తెస్తుందనే ఉద్దేశ్యంతో జయలలితకు పాలనలో అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పదవికి ఆమెనే ప్రతిపాదించవలసి వచ్చింది. వ్యక్తిగతంగా శశికళ ఎంతటి సన్నిహితురాలైనా పార్టీలో, ప్రభుత్వంలో జయలలిత ఆమెకు ఎటువంటి హోదా ఇవ్వక పోవడం గమనార్హం.
అదే సమయంలో అధికారపక్షంలో అసంతృప్తిగా ఉన్న 20 మంది యం ఎల్ ఏ లను తమవైపు తిప్పుకొంటే డీయంకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే కరుణానిధి తొందర పడకపోవచ్చని, అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిరంగమయ్యే వరకు వేచి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వ సుస్థిరత అంతా శశికళ వైఖరిపైననే ఆధారపడి ఉంటుంది. గత ఎన్నికలలో ఆమె ద్వారా పార్టీ సీట్ పొంది, గెలుపొందిన 40 నుండి 50యం ఎల్ ఏ లకు మించి ఆమెకు మద్దతు లేదు. పార్టీ అభిమానులలో సహితం ఆమె పట్ల సదభిప్రాయం లేదు. వాస్తవాలను గ్రహించి, ఆమె ఒదిగి ఉంటె ఆమెకు, పార్టీకి, ప్రభుతానికి సహితం ప్రయోజనం కలుగుతుంది. లేదా రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీసి రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశం ఉన్నది. ప్రస్తుత పరిస్థితులలో రెండు ద్రావిడ పార్టీలు సహితం మధ్యంతర ఎన్నికలకు సాహసం చేయక పోవచ్చు.
ఆరు నెలల క్రితమే తమిళ్ నాడు అసెంబ్లీ కి ఎన్నికలు జరగడం, సుమారు సంవత్సరం కాలంగా అక్కడ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తూ ఉండక పోవడంతో ఇప్పుడే మధ్యంతర ఎన్నికలను ఎవ్వరూ కోరుకొనే అవకాశం లేదు. మొత్తం మీద ద్రావిడ రాజకీయాల ఆధిపత్యాన్ని జాతీయ పార్టీలు ఛేదించడానికి 2019 లోక్ సభ ఎన్నికలు ఒక మంచి అవకాశం కాగలదు. ఈ లోగా జరుగబోయే రాజకీయ సమీకరణాలు, మార్పులు జాతీయ రాజకీయలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.