తమిళనాడు ఎన్నికల యుద్ధంలో గెలవడానికి అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా 297 అస్త్రాలను వదిలారు. తమిళ ప్రజలు ఏమీ చేయాల్సిన పని లేదు.. అన్నాడీఎంకేకు ఓటేస్తే చాలు. ఇంటికో ఫ్రిడ్జ్, పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు చాలా చిన్నవి. ఇంటికో ఫ్రిడ్జ్, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ. 2,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్రు. అలాగే పెళ్లి సమయంలో మంగళసూత్రం కోసం బంగారం, వివాహ ఆర్థిక సాయం కూడా ఇస్తారు.
అంతే కాదు విచిత్రంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అన్నా డీఎంకే వాగ్దానం చేసింది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను దశలవారీగా మూసివేస్తామని ఎడప్పాడి పళనిస్వామి భరోసా ఇచ్చారు. అచ్చంగా జగన్ కూడా ఇదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధిక రేట్లకు చీప్ లిక్కర్ అమ్మి ప్రజల్ని మోసం చేశారు. ఇక నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 2,000 చొప్పున భృతి , ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు పంపిణీ కూడా హామీల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి అంశాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.
297 పథకాలు ప్రకటించారు సరే.. కానీ వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనే ప్రశ్న సహజంగానే ప్రజలకు వస్తుంది. పళనిస్వామి పట్టుదలతో 297 హామీలు ఇచ్చినా, అవి వాస్తవ రూపం దాలుస్తాయని నమ్మడం కంటే.. ఆ ఆశల పల్లకిలో కాసేపు విహరించి నవ్వుకోవడమే మేలని ఓటర్లు భావించే అవకాశం ఉంది. అయితే ఇంకా డీఎంకే, టీవీకే కూడా పూర్తి స్థాయి మేనిఫెస్టోలు ప్రకటించాల్సిఉంది. అవి ఎంత విచిత్రంగా ఉంటాయో చూడాల్సి ఉంది.


