యూపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించబడిన షీలా దీక్షిత్ పై కేంద్రప్రభుత్వం ఎసిబి అస్త్రం ప్రయోగించింది. ఆమె 2012లో డిల్లీ జల్ బోర్డు చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు నగరంలో నీళ్ళు సరఫరా చేయడం కోసం కొన్ని ప్రైవేట్ కంపెనీలకి 385 స్టెయిన్ లెస్ స్టీల్ నీళ్ళ ట్యాంకర్ల సరఫరాకి టెండర్లు ఆమోదించారు. ఆమె తరువాత డిల్లీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఐదుగురు సభ్యులతో కూడిన ఒక విచారణ కమిటినీ ఏర్పాటు చేశారు. నీళ్ళ ట్యాంకర్ల కొనుగోలులో రూ.400 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆ కమిటీ నిర్ధారించింది. ఇప్పుడు అదే ఆమె పీకకి, అరవింద్ కేజ్రీవాల్ పీకకి కూడా చుట్టుకొంది. వారిద్దరే పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో భాజపాకి గట్టి సవాలు విసురుతున్నారు కనుక కేంద్రప్రభుత్వం వారివురిపై ఏసిబిని ప్రయోగించింది.
అరవింద్ కేజ్రీవాల్ పై ఏసిబి అధికారులు ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేశారు. వారు నిన్న షీలా దీక్షిత్ ని ఆమె నివాసంలోనే సుమారు రెండు గంటలపాటు ప్రశ్నించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి మరో 18 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నాపత్రాన్ని ఆమె చేతికి ఇచ్చి వీలైనంత త్వరగా సమాధానాలు చెప్పాలని కోరారు.
యూపిలో ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించబడిన షీలా దీక్షిత్ పైనే ఏసిబిని ప్రయోగించడంతో, ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ కూడా పడి దాని విజయావకాశలని దెబ్బ తీసే అవకాశం ఉంది. అదేవిధంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో భాజపాకి సవాలు విసురుతున్న అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఇదే కేసుతో కట్టడి చేయాలని భాజపా వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కేసు భాజపాకి మంచి ఆయుధంగానే ఉపయోగపడవచ్చు కానీ అదే ఆమాద్మీ, కాంగ్రెస్ పార్టీలకి చాలా మేలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కుంభకోణం 2012లో జరిగితే దానిని కేంద్రప్రభుత్వం సరిగ్గా ఈ ఎన్నికలకి ముందు బయటకి తీసి వారిపై ప్రయోగిస్తోంది కనుక భాజపా ఎన్నికలలో తమని ఎదుర్కోలేకనే ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోందని ఆ రెండు పార్టీలు గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి పొందవచ్చు. ఆ కారణంగా ప్రజలు వాటివైపే మొగ్గు చూపితే భాజపా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.