ఎక్కడో ఏలూరులో…చిరంజీవి సినిమాలు చూస్తూ.. ఆయన్ని ఆరాధిస్తూ.. పెరిగాడో కుర్రాడు.
ఎప్పటికైనా చిరంజీవిని కలవాలి.. ఆయనతో నడవాలి.. అనే ఓ కల కన్నాడు అందుకోసం ఏం చేయాలో కూడా తెలీదు. కానీ విధి ఆ కుర్రాడ్ని హైదరాబాద్ తీసుకొచ్చింది. పీఆర్వోగా చేసింది. నిర్మాతగానూ మార్చింది. చివరికి మెగా కాంపౌండ్‌లో కీలకమైన వ్యక్తిగా నిలబెట్టింది. తనే.. ఎస్.కె.ఎన్. గీతా ఆర్ట్స్ లో అనేక చిత్రాలకు నిర్మాతగా పనిచేసి, `ఈరోజుల్లో`తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. `టాక్సీవాలా`తో సోలో నిర్మాతగా మారాడు. పైరసీ బారిన పడి కూడా ఆ సినిమా విజయఢంకా మోగించింది. ఈసందర్భంగా ఎస్.కె.ఎన్తో తెలుగు360 ప్రత్యేకంగా ముచ్చటించింది. తన జీవితంలోని ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఏంటో.. ఆయన మాటల్లోనే…
పీఆర్వో నుంచి ప్రొడ్యూసర్ వరకూ… ఈ ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
పీఆర్ ఓ మూడక్షరాలే…. ప్రొడ్యూసర్ అనగానే మరి కొన్ని అక్షరాలు పెరుగుతాయంతే. నాకైతే మరీ అంత కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే పీ ఆర్వోగా ఉన్నప్పుడు ప్రమోషన్లు, మార్కెటింగ్ చూసుకునేవాడ్ని. ఇప్పుడు ఇంకొన్ని కొత్త బాధ్యతలు పెరిగాయంతే. ఇది వరకు `ఈరోజుల్లో` లాంటి చిత్రాన్ని మిత్రులతో కలసి నిర్మించిన అనుభవం ఉంది కదా. అదిప్పుడు అక్కరకు వచ్చింది.
ప్రొడక్షన్ అనేది డబ్బుతో ముడిపడిన వ్యవహారం కదా..?
కథని నమ్మి తీసిన సినిమా ఇది. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ఉన్నాడు. దానికి తోడు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ లాంటి రెండు అగ్ర నిర్మాణ సంస్థలు మా వెనుక ఉన్నాయి. మినిమం బడ్జెట్లో సినిమా పూర్తి చేయగలిగాం.
కాబట్టి డబ్బుల పరంగా ఎలాంటి టెన్షన్ లేదు. అవుట్ పుట్ ఎలావస్తుంది? రెండు బ్యానర్లు నమ్మి నన్ను నమ్మి నా చేతుల్లో ఓ సినిమా పెట్టారు కదా. దాన్ని ఎంత వరకూ నిలబెట్టుకుంటాను? అనే భయం ఒక్కటే ఉండేది.
సినిమాపైరసీకి గురైనప్పుడు నిర్మాతగా మీ ఆలోచనలు.. ఆ సమయంలో అల్లు అరవింద్, విజయ్ దేవరకొండలు ఇచ్చిన ధైర్యం..?
నేనూ నా టీమ్ మొత్తం నిరాశకు గురయ్యాం. ఇదో కమర్షియల్ సినిమా అయితే కొంచెం ధైర్యం ఉండేది. కాన్సెప్ సినిమా కదా.. ట్విస్టులు ముందే రివీల్ అయిపోతాయి. ఆ తరవాత జనం థియేటర్‌కి వచ్చి చూస్తారా, లేదా? అనే భయం పట్టుకుంది. ఆ సమయంలో సినిమాని విడుదల చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. అప్పటికి సీజీ ఇంకా పూర్తవలేదు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ, సీజీ స్టూడియోల చుట్టూ తిరగడమే నా పని అయిపోయింది.
అయినా అధైర్య పడలేదు. ఎక్కడో ఓ చిన్న ఆశ. కష్టపడడ్డాం కదా. అది ఎక్కడికీ పోదు అనే ధైర్యం ఉండేది. పైరసీ ఎఫెక్ట్ ఉంటుందని తెలుసు గానీ, అది ఎంత వరకూ ఉంటుందన్నది మా ఊహకు అందలేదు.
ఈ దశలో అరవింద్ గారు తీసుకున్న చొరవ, అందించిన సహకారం అంతా ఇంతా కాదు. ఆయన వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడారు. యాంటీ పైరసీ సెల్ టీమ్తోనూ మాట్లాడారు. ఇది వరకే విజయ్ దేవరకొండ `గీతా గోవిందం` పైరసీ అయ్యింది. ఆ అనుభవంతో తాను కాస్త ధైర్యంగా ఉన్నాడు.
తన ట్విట్టర్లో మాత్రం అభిమానులు చాలా మెసేజ్‌లు పెట్టేవారు. ఈ సినిమా ఇక విడుదల చేయొద్దు అనే రిక్వెస్ట్‌లే ఎక్కువగా కనిపించేవి. `బయటకు వచ్చిన సినిమా ఛండాలంగా ఉంది` అని చాలామంది చెప్పారు. కారణం.. అప్పటికి సీజీ పూర్తవలేవు. పైగా అవుట్ పుట్ కూడా నాలుగు గంటలుంది. ఇలాంటి నెగిటీవ్ కామెంట్లు విని కూడా తట్టుకుని నిలబడ్డాడు. మా వెనుకే ఉన్నాడు.
మొత్తానికి నిర్మాతగా నిలబడిపోయారు. పరిశ్రమలో అడుగుపెట్టిన గోల్ నెరవేరినట్టేనా?
చిరంజీవిగారి అభిమానిగా ఈ చిత్రసీమలో అడుగుపెట్టా. ఓ విజయవంతమైన నిర్మాతగానే ఆయన్ని కలవాలి అనుకున్నా. అలానే…. ఈ సినిమా హిట్టుకొట్టి ఆయనకు కనిపించా. `ఇది చాలు సార్ నా జీవితానికి` అని చెబితే… `అలా అనకు. ఇక నుంచే నీ ప్రయాణం మొదలవ్వాలి` అని ప్రొత్సహించారు.
అసలు చిత్రసీమలోకి ఎలా అడుగుపెట్టారు.. మీ వెనుక ఎవరున్నారు?
నేను చిన్నప్పటి నుంచీ చిరంజీవిగారికి వీరాభిమానిని. ఆయన్ని కలుసుకోవాలి.. ఆయనతో కలసి ప్రయాణం చేయాలని గట్టిగా అనుకునేవాడ్ని. అదెలాగో.. ఏం చేస్తే ఆయన్ని కలుసుకోవచ్చో నాకు తెలీదు. చదువు అయిపోయిన తరవాత మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండకూడదు అని గట్టిగా ఫిక్సయ్యా. మనసులో ఒకటి బలంగా అనుకుంటే అది జరిగి తీరుతుందట. అలా.. నేను అనుకున్నదే జరిగింది.
ఆ ప్రయాణం ఎలా జరిగిందో కాస్త వివరంగా చెబుతారా?
మృగరాజు సమయంలో అనుకుంటా. అప్పటికి ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కాదు. అయితే… కొన్ని మెగా ఫ్యాన్స్ కోసం కొన్ని వెబ్ సైట్లు నిర్వహించేవాడ్ని. అలా అల్లు శిరీష్ గారు, కుమార్ కోనేరు నాకు పరిచయమయ్యారు. ఫ్యాన్స్ కోసం నేను చేస్తున్న కృషిని చూసి అప్పట్లో ఓ కంప్యూటర్ కూడా నాకు బహుమతిగా ఇచ్చారు. గంగోత్రి టైమ్‌లోనే నేను హైదరాబాద్ వచ్చేశా. ఇక్కడకు వచ్చి ఓ వెబ్ సైట్ పెట్టాను. ఆ తరవాత టీవీ 9లో జాయిన్ అయ్యా. ఆ క్రమంలోనే
చరణ్, బన్నీలతో సాన్నిహిత్యం పెరిగింది.
పీ ఆర్వోగా తొలి సినిమా ఏది?
అఫీషియల్‌గా నేను చేసిన పెద్ద సినిమా జల్సా. ఆ తరవాత గీతా ఆర్ట్స్, యూవీ, దానయ్య, ఆర్కా మీడియా… ఇలా చాలా సంస్థలకు పనిచేశా. అయితే గీతా, యూవీ మాత్రం మాతృ సంస్థలుగా మారిపోయాయి.
టీవీ 9 అంటే జాబ్ సెక్యురిటీ ఉంటుంది. ఆ ఉద్యోగం వదిలి రావడం ఆ రోజుల్లో రిస్క్ అనిపించలేదా?
ఆ సమయంలో చిరంజీవిగారు ప్రజా రాజ్యం పార్టీ పెట్టారు. బన్నీ, చరణ్‌లు కాంపెయినింగ్ చేసేవారు. నాక్కూడా వాళ్లతో పాటు కాంపెయినింగ్ చేయాలనిపించేది. ఓ పక్క ఉద్యోగం, ఇంకో వైపు అభిమానం. టీవీ 9 లాంటి సంస్థలో ఉద్యోగం చేస్తూ… ఇలా పార్టీ తరపున తిరగడం నాకే కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశా. ఈ ఉద్యోగం వదిలేస్తే ఏం జరుగుతుందనేది ఆలోచించలేదు. ఓ అభిమానిగా ఆయన వెంట నడవాలనుకున్నానంతే.
ఈ ప్రయాణంలో ఎదురుదెబ్బలేం తగల్లేదా?
తగిలాయి. కానీ తట్టుకున్నా. మిడిల్ క్లాస్ నుంచి వచ్చాకదా. ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నాకు అనుభవమే.
అలానే ఎదిగాను కూడా. స్నేహితులంతా కలసి `ఈరోజుల్లో` తీశాం. అది పెద్ద విజయం సాధించింది. అయితే నిర్మాణ రంగంగా ఎక్కువ అనుభవం లేకపోవడం వల్ల.. లాభాలు చూడలేకపోయాం. రొమాన్స్ బాగానే ఆడింది. కానీ పేరు రాలేదు. దాంతో పోగ్రెస్ స్లో అయిపోయింది. నిర్మాణాన్ని పక్కన పెట్టి పీ ఆర్వో బాధ్యతలు చూసుకునేవాడ్ని.
భలే భలే మగాడివోయ్, ప్రేమకథా చిత్రం, మహానుభావుడు.. ఇలా కొన్ని సినిమాలకు నిర్మాణం దగ్గరుండి చూసుకున్నా. దాంతో కాస్త రాటుదేలా. మంచి కథ వస్తే.. మళ్లీ సొంతంగా ప్రొడక్షన్ చేయాలనిపించింది. టాక్సీవాలాతో అది కుదిరింది.
ఈరోజుల్లో సినిమాకి కష్టపడింది మీరు.. కానీ లాభాలు ఇంకెవరో పట్టుకెళ్లిపోయారు. బాధనిపించలేదా?
ఈ విషయంలో ముమ్మాటిదీ మాదే తప్పు. మాకు పెద్ద పెద్దవాళ్లంవతా తెలుసు. కానీ వాళ్ల సలహాలు తీసుకోకుండా మాకు మేమే నిర్ణయాలు తీసేసుకున్నాం. ఆ సమయంలో బన్నీ, అరవింద్‌గారు బాగా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల అయ్యాక… దిల్‌రాజు గారు కూడా మాకు అండగా నిలబడ్డారు.
మెగా కాంపౌండ్ వ్యక్తి అని ముద్ర పడిపోతే ఎన్ని లాభాలు ఉంటాయో, అన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మిగిలిన హీరోలు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్ని ఎలా దాటుకుని వచ్చారు?
నేను అభిమానిని తప్ప.. దురాభిమాని కాదు. ఏ హీరోపైనా నాకు వ్యతిరేకత లేదు. ఏదైనా పెద్ద సినిమా విడుదల అయ్యిందంటే.. ముందుగా టికెట్ తెగేది చిరంజీవిగారి అభిమానుల నుంచే. మెగా కాంపౌండ్ హీరోల సినిమా హిట్టయితే ఎంత సంతోషిస్తానో, బయటి హీరోల సినిమా హిట్టయినా అంతే సంతోషిస్తా. నేను బేసిగ్గా సినిమా అభిమానిని. సినిమా అనేది నా ప్రొఫెషన్. ఏ హీరో దగ్గర పనిచేసినా అంతే కమిట్మెంట్ పనిచేశా. అందుకే… మిగిలిన హీరోల దగ్గరా మంచి పేరు సంపాదించుకోగలిగా.
బన్నీకి దగ్గరైనట్టు చరణ్‌కి ఎందుకు దగ్గర కాలేకపోయారు?
అలా ఏం లేదు. గోవిందుడు అందరివాడేలే వరకూ చరణ్ సినిమాల్ని కూడా నేనే హ్యాండిల్ చేసేవాడ్ని.
భలే భలే మగాడివోయ్ తరవాత ప్రొడక్షన్ బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. నేను చరణ్ సినిమాలకు పీ ఆర్వో చేయకపోవొచ్చు. కానీ రెగ్యులర్‌గా కలుస్తుంటా. నా సినిమా విడుదల అవుతుంటే… ఆయన ప్రొత్సాహం తప్పకుండా ఉంటుంది.
దర్శకుడు మారుతితో చాలా క్లోజ్ గా ఉంటారు కదా.. ఆ అనుబంధం ఎప్పటిది?
సినిమాల్లోకి రాక ముందు నుంచీ ఉంది. నేను, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మారుతీ… ఇలా మేమంతా కలసి సినిమాల్ని పంపిణీ చేసేవాళ్లం. వెస్ట్, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ మా సినిమాలే ఆడేవి. అప్పటి నుంచీ మారుతి మంచి ఫ్రెండ్ అయ్యాడు. నేను జర్నలిస్టు అయ్యాక… నాతో పాటు ప్రీమియర్ షోలకు తీసుకెళ్తుండేవాడ్ని.
నేనూ శ్రేయాస్ శ్రీనివాస్.. ఇలా కొంతమంది మిత్రులు కలసి `ఈరోజుల్లో` సినిమా తీశాం. అప్పటి నుంచీ మా స్నేహం మరింత బలపడిపోయింది. తన ప్రతీ ఆలోచన నాతో పంచుకుంటాడు. తను ఇప్పటి వరకూ 8 సినిమాలు తీస్తే… ఆరు సినిమాల పోస్టర్లపై నా పేరు కనిపిస్తుంది.
ఈరోజుల్లో సినిమా అటూ ఇటూ అయితే పరిస్థితి ఏమయ్యేది?
అప్పుడు రెండేళ్లు తీసిన సినిమా అది. డబ్బులన్నీ ఒకేసారి పెట్టలేదు. మా చేతుల్లో ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు షూటింగ్ చేసేవాళ్లం. కాబట్టి సినిమా పోతే.. జీవితాలు తల్లకిందులైపోతాయి అన్న భయం లేదు. కానీ చివర్లో ఒకేసారి 90య లక్షలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టాం. అది మాత్రం పెద్ద రిస్కే. సినిమా ఆడింది కాబట్టి… లక్కీగా బయటపడ్డాం.
పీఆర్వోగా కాకుండా వ్యక్తిగా బన్నీ మీకిచ్చే ప్రాధాన్యం ఎంత? కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్న సందర్భాలు ఉన్నాయా?
మా రిలేషన్లో డిజిగ్నేషన్లు లేవు. నేను పీ ఆర్ , తను హీరో అని ఎప్పుడూ అనుకోలేదు. తనతో పాటు ట్రావెల్ చేయడానికి నేను ఎంచుకున్న ప్రొఫెషన్ అది. తన సినిమా ఫస్ట్ కాపీ నేను చూస్తా. కొన్ని సినిమాల కథలు ముందే వింటా. స్టోరీ సిట్టింగ్‌లో ఉంటా. నా సలహాలు అప్పుడప్పుడూ తీసుకుంటాడు. బన్నీ నన్ను ఆదుకుని తీరాల్సిందే అనుకున్నంత రేంజులో ఎప్పుడూ కష్టాల్లో కూరుకుపోలేదు. కానీ నాకు కష్టం వస్తే తాను ఆదుకుంటాడన్న మానసిక ధైర్యం నాకెప్పుడూ ఉంటుంది. ఏం జరిగినా బన్నీ ఉన్నాడులే అనే ధైర్యమే నన్ను నడిపిస్తోంది. ఈరోజుల్లో తీసేటప్పుడు చాలా సపోర్ట్ చేశాడు. టాక్సీవాలా లీక్ అయినప్పుడు కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు.
అల్లు అరవింద్ నుంచి నేర్చుకున్నదేంటి?
ఎంత కష్టం వచ్చినా స్థిరంగా ఉంటారు అల్లు అరవింద్. ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. కష్టం వచ్చినప్పుడు కంగారు పడకండి.. ఆ కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఒత్తిడి పెరగడం తప్ప లాభం ఏమీ లేదు… అని చెబుతుంటారు. అది ఆయన్నుంచి నేను నేర్చుకున్న లక్షణం. మన ఇంట్లో హీరోల్ని ఎలా గౌరవిస్తామో, బయటి హీరోల్నీ అలానే గౌరవించాలి అని పదే పదే చెబుతుంటారు. గీతా ఆర్ట్స్ బయటి హీరోలతో సినిమాలు తీసినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటుంది. అందుకే వాళ్ల కెరీర్లో మంచి విజయాలు నమోదయ్యాయి.
ఇక మీదట మిమ్మల్ని పీ ఆర్వోగా చూడాలా? నిర్మాతగానా?
నిర్మాతగానే ప్రయాణం కొనసాగుతుంది. టాక్సీవాలానే కొన్ని మంచి కమర్షియల్ కాన్సెప్టులు తయారు చేసుకుంటున్నాం. త్వరలో ఒకొక్కటీ పట్టాలెక్కిస్తాం.
టాలీవుడ్లో పీఆర్వోల మధ్య యూనిటీ ఉందా?
నేను అందరితోనూ బాగుంటా. బీఏ రాజుగారు నాకు గురువుగారు. వంశీ – మహేష్‌లు పీఆర్వోలు అవుతున్నామని నాకే ముందు చెప్పారు. వంశీ శేఖర్.. నేనూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాం.
అంతే తప్ప మీ మధ్య గ్రూపులేం లేవంటారు..
ఉన్నదే చాలా తక్కువ మంది. ఇది వరకు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు.. ఇప్పుడు మాత్రం మేమంతా బాగానే ఉంటున్నాం.