నంద్యాలలో మరీ దిగబడిపోయామా?

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న కొద్ది ప్రధాన పోటీ దార్లయిన టిడిపి వైసీపీలలో ఒక విధమైన అంతర్మధనం కనిపిస్తుంది. గట్టిపోటీ ప్రచారంతో సరిపెట్టకుండా దాన్ని మరీ సవాలుగా తీసుకుని అతిగా దిగబడిపోయామా అన్న శంక పట్టుకుంది. మొదట్లో ప్రభుత్వమే ఈ హడావుడి ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లతో సహా చాలా మంది అక్కడ మకాం వేశారు. (అయితే తర్వాత మళ్లీ లోకేశ్‌ను రానివ్వకపోవడం కొంత వింతగానే అనిపించింది.) వరాల వరద పారించారు. అధికారంలో వున్నాం గనక ఎలాగో మననే ఎన్నుకుంటారన్న భరోసా పాలకపక్షంలో వుంది. ఒక వేళ అనుకోని ఫలితం వచ్చినా అధికారానికి ఢోకా లేదు గనక మళ్లీ దిద్దుకోవచ్చని కూడా చెప్పుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే రాబోయే కాలమంతా రాజకీయ సవాలే గనక ఏది ఏమైనా ఓడించాలన్నదే చంద్రబాబు వ్యూహంగా వుంది. వైసీపీపరిస్థితి ఇందుకు భిన్నంగా వుంటుంది. తాము గెలుస్తామని గట్టిగానే నమ్ముతున్నా పొరబాటును జరక్కపోతే మొత్తంగా మనపై విశ్వాసమే సన్నగిల్లుతుందని కొందరు పెద్దలు వాదిస్తున్నారు. 2014లోనూ ఇలాగే గెలిచి తీరుతామన్న అతి విశ్వాసం దెబ్బతీసిందని వారంటారు. జగన్‌ అన్ని రోజులు మకాం వేసి వీధివీధి తిరిగినా ఫలితం రాకపోతే వచ్చే ఎన్నికలపై ముందే ప్రతికూల ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ గెలిస్తే బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు గాని మరో విధమైన ఫలితం వస్తే కలిగే నష్టం అంతకు చాలా రెట్టు ఎక్కువగా వుంటుందని వారు హెచ్చరిస్తున్నారుఅంతగా అనుకోని ఫలితం వస్తే ఎన్నికలు న్యాయంగా జరగలేదన్న వాదన వుండనే వుంటుంది కదా అని మరికొందరు చెబుతున్నారు. టిడిపిని తక్కువ అంచనా వేయొద్దని అందరూ సూచిస్తున్నారు. ఏది ఏమైనా తుది తీర్పు ఓటరు చేతుల్లోనే వుంది మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.