వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కేవలం ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఫేస్బుక్, ఎక్స్లలో పోస్టులు పెట్టినందుకే అర్ధరాత్రి వేళల్లో సీఐడీ, స్థానిక పోలీసులు ఇళ్లపై పడి అరెస్టులు చేసిన సంఘటనలు వందలాదిగా ఉన్నాయి. మరీ దారుణంగా, కేవలం రాజకీయంగా అణచివేయాలనే ఏకైక లక్ష్యంతో సోషల్ మీడియా ఐటీ చట్టాల కింద కాకుండా, జీవితాలను నాశనం చేసేలా గంజాయి రవాణా, రేప్ కేసులు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నాన్-బెయిలబుల్ అక్రమ కేసులను టీడీపీ కేడర్‌పై అక్రమంగా బనాయించారు. దీంతో ఎంతోమంది యువకులు, పార్టీ సానుభూతిపరులు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక, ఆర్థిక నష్టాన్ని చవిచూశారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు.. ఇంకా సాగుతున్న కోర్టుల వేట!
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమపై ఉన్న అక్రమ కేసులు తక్షణమే రద్దవుతాయని వేలాది మంది కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా ప్రాథమికంగా బాధితుల వివరాలతో కూడిన లిస్టులను సేకరించింది. అయితే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ అందరిపై కేసులు ఎత్తివేసే ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలతో జరిపిన అంతర్గత సమీక్షా సమావేశాలలో మాట్లాడిన మాటలను బట్టి క్షేత్రస్థాయిలో కేడర్ ఇప్పటికీ ఈ అక్రమ కేసుల వల్ల ఇబ్బందులు పడుతోందనే చేదు నిజం స్పష్టమయింది.
కేడర్‌ను పట్టించుకోని నేతలు.. లోకేష్ సీరియస్ వార్నింగ్!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు తమ సొంత పనుల్లో, అధికారిక హోదాల్లో బిజీ అయిపోయి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ కోసం లాఠీ దెబ్బలు తిని, జైలుపాలైన నిఖార్సైన కార్యకర్తలను విస్మరించారనే అసంతృప్తి పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌పై నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, వెంటనే వారందరికీ న్యాయ సహాయం అందించి కేసుల నుంచి విముక్తి కల్పించే బాధ్యతను స్థానిక నేతలే తీసుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.. అప్పుడే ‘న్యాయం’!
ఇప్పటికైనా ప్రభుత్వం , టీడీపీ అధిష్టానం కేవలం సాధారణ ఆదేశాలకే పరిమితం కాకుండా, ఒక స్పెషల్ లీగల్ సెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కేసుకు సంబంధించిన డేటాను క్రోడీకరించి, చట్టపరమైన లూప్‌హోల్స్‌ను తొలగిస్తూ హోంశాఖ ద్వారా జీవోలు జారీ చేసి కేసులను మాఫీ చేయించాలి. ఐదేళ్లపాటు సర్వస్వం కోల్పోయి పోరాడిన కేడర్‌తో నిరంతరం టచ్‌లో ఉంటూ, వారిపై ఉన్న అక్రమ కేసుల మరకలను త్వరితగతిన తుడిచివేసినప్పుడే.. భవిష్యత్తులో పార్టీ కోసం పని చేసే కార్యకర్తల్లో నమ్మకం, ధైర్యం నిలుస్తాయి.
