తెలుగు రాష్ట్రాల పోలీసులకే కాదు దేశవ్యాప్తంగా విస్తరించిన అతి పెద్ద సమస్య సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయడం. ఉన్నత స్థానాల్లో బాధ్యతలు తీసుకుంటున్న వారు మొదటగా సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయడమే తమ ప్రయారిటీ అంటున్నారంటే పరిస్థితి ఎలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను ఇలా తయారు చేస్తున్నాయి. ఎక్కడైతే దొరికిపోతారని విదేశాల్లోని వారిని ఇలాంటి పనులు చేయమని ప్రోత్సహిస్తున్నాయి. వారికి గుర్తింపు ఆఫర్ చేస్తున్నారు. పదవుల ఆశ పెడుతున్నారు. ఇంకా కావాలంటే ఇక్కడ్నుంచి దుబాయ్ వంటి ప్రాంతాలకు తరలించి అక్కడే షెల్టర్ ఇచ్చి పోస్టులు పెట్టిస్తున్నారు. ఆ పోస్టులు అత్యంత ఘోరంగా ఉంటున్నాయి.
ఏపీ ప్రభుత్వం వీటిని కట్టడి చేయడానికి ప్రత్యేకంగా ఏం చేయాలో ఆలోచిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. కేంద్రం కూడా ప్రత్యేక చట్టం తెచ్చే ఆలోచనలో ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా ఓ చట్టం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సైకోయిజం పెరిగిపోవడానికి కారణం ఫేక్ అకౌంట్లే. ఎవరో తెలియదు.. ఎక్కడ ఉంటారో తెలియదు.. ఫేక్ పేరుతో వాగేస్తూ ఉంటారు. అలాంటి వారి వల్లనే సమస్యలు వస్తూంటాయి. ఈ ఫేక్ అకౌంట్లను వందల కొద్దీ సృష్టించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రతి వ్యక్తి కేవలం ఒక్క అకౌంట్ ను.. అదీ అధార్ అథెంటికేషన్ తో నిర్వహించే అవకాశం కల్పిస్తే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది.
మాట్లాడే ప్రతి మాటకు.. చేసే ప్రతి పోస్టుకు ఆ వ్యక్తి బాధ్యత వహిస్తూ.. అతనే ఇలా చేస్తున్నాడని పది మందికి తెలిసేలా ఉంటేనే.. సైకోయిజం కంట్రోల్ అవుతుంది. అతను అన్నింటికీ బరి తెగిస్తే చట్టాలను అధిగమిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకటి పోతే ఇంకోటి ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని తమ సైకోయిజం చూపిస్తూ ఉంటే.. ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించేవారిని బాధ్యతలను చేయలాంటే కచ్చితంగా కొన్ని రూల్స్ పెట్టాలన్న ఆలోచన చేస్తోంది. ఎంత త్వరగా వీటిపై నిర్ణయం తీసుకుంటే.. అంత త్వరగా పరిష్కారం అవుతుంది. లేకపోతే .. ఒకే సైకో మనస్థత్వం ఉన్న వ్యక్తి వందల అకౌంట్లు తెరిచి… ఓ సైకో సైన్యంగా మారిపోతూనే ఉంటాడు.